హిందూపురం జిల్లా సాధన కోసం ఎమ్మెల్యే బాలకృష్ణ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ప్రజాస్వామ్య పద్దతుల్లో ఆందోళనలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే హిందూపురం చేరుకున్న ఆయన శుక్రవారం మౌనదీక్ష చేయనున్నారు. హిందూపురంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీ అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద బాలకృష్ణ మౌనదీక్ష చేయనున్నారు.
ఆ తరవాత అఖిలపక్షాల నేతలతో ఉద్యమ కార్యాచరణపై చర్చించనున్నారు. ఇప్పటికే హిందూపురంలో జిల్లా సాధన ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. చిరకాలంగా హిందూపురం జిల్లా డిమాండ్ ఉంది. వైసీపీ మేనిఫెస్టో ప్రకారం.. పార్లమెంటరీ నియోజకవర్గాలను జిల్లా కేంద్రం చేయాల్సి ఉంది.కానీ హిందూపురాన్ని మాత్రం జిల్లా కేంద్రం చేయకుండా పుట్టపర్తిని జిల్లాకేంద్రంగా ప్రకటించారు. దీనిపై హిందూపురంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాల విభజన అనేది మంచిపని అని అయితే రాజకీయం చేయడం మంచిది కాదని తక్షణం హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్నారు. జిల్లా కేంద్రానికి అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు హిందూపురంలో ఉన్నాయన్నారు. ప్రజలు కూడా స్వచ్చందంగా రోడ్ల మీదకు వస్తున్నారు. దీన్ని ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో చూడాల్సి ఉంది.