ఉద్యోగుల వివాదంలో మొదట సజ్జల రామకృష్ణారెడ్డి సైడ్ అవ్వాలనుకున్నారు కానీ ఇతర నేతలు..మంత్రులు తమకెందుకు అన్నట్లుగా ఉండటంతో మళ్లీ ఆయన ముందుకు రాక తప్పడం లేదు. అన్ని ప్రకటనలు ఆయనే చేస్తున్నారు. ఇప్పుడు బాధ్యతకూడా ఆయన మీదే పడింది . ఆయన సలహాల మీదనే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ కారణంగా ఇప్పుడు ఏం జరిగినా ఆయనే బాధ్యత వహించాల్సి ఉంది. ఇప్పటికే ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం డీల్ చేసిన విధానం అత్యంత దారుణంగా ఉందని.. వారిని అవమానించారని.. అలా చేయకుండా ఉండాల్సిందన్న అభిప్రాయం ఉంది.
ఈ క్రమంలో ఉద్యోగులు కూడా తమ సమస్యలపై మాట్లాడుతున్న సజ్జల ఎవరు ? అతనికి ఉన్న అధికారం ఏమిటి అని ప్రశ్నించడం వైరల్ అవుతోంది. మరో వైపు వైసీపీలోనూ ఆయన డామినేషన్పై రకరకాల చర్చ జరుగుతోంది. సకల శాఖల మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్న తీరు సొంత పార్టీలోనూ అసంతృప్తికి కారణం అవుతోంది. అయితే జగన్ ఆయనపై ఎక్కువగా డిపెండ్ అవడం వల్ల.. ఆయనపై ఎక్కువనమ్మకం ఉంచుకోవడం వల్ల ఎవరూ బయటపడలేకపోతున్నారు. ఒక్క సారిగా ఆయనపై జగన్కు మొహం మెత్తినట్లుగా బయటకు అనిపిస్తే అందరూ బయటకు వచ్చే అవకాశం ఉంది.
సజ్జల దెబ్బకు అత్యంత దారుణంగా దెబ్బతిన్న విజయసాయిలాంటి వారు అవకాశాల్ని వదులుకోరు. సజ్జల వ్యవహారం వల్ల తీవ్రంగా నష్టం జరుగుతోందన్న భావన జగన్కు వచ్చిన మరుక్షణం వైసీపీలో సీన్లు మారిపోతాయని తెలుస్తోంది. ఉద్యోగుల ఆందోళన ఎలాంటి మలుపు తిరుగుతుందనేదానిపైనే ఇది ఎక్కువగా ఆధారపడి ఉంది.