ఉద్యోగుల ఉద్యమానికి ప్రజల మద్దతు లభించదని.. ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రజల్ని ఏకం చేయాలనుకున్న ప్రభుత్వానికి చలో విజయవాడ జరిగిన తీరు ఇబ్బందికరమే. ఉద్యోగ సంఘాల నేతలు పిలుపు అయితే ఇచ్చారు కానీ..ఎంత మంది వస్తారు..? ఎలా వస్తారు ? వారికి ఏమైనా ఏర్పాట్లు చేయగలమా అన్న దానిపై కనీస ఆలోచన కూడా చేయలేకపోయారు. కానీ ఉద్యమాన్ని నడుపుతోంది ఉద్యోగులే కాబట్టి వారు వెల్లువలా వచ్చారు. కానీ వారికి కావాల్సిన కనీస సదుపాయాల్ని విజయవాడ ప్రజలే తీర్చారు. చాలా చోట్ల మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు. కొన్ని చోట్ల భోజన వసతి కూడా కల్పించారు.
ప్రజల నుంచి ఇంత మద్దతు వస్తుందని ఉద్యోగ సంఘం నేతలు కూడా ఆలోచించలేకపోయారు. పోలీసుల హెచ్చరికల వల్ల తాము ఎలాంటి ఏర్పాట్లు చేయలేకపోయామని కానీ ప్రజలు ఉద్యోగులకు సహకరించారని సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ప్రతీ ఇంటికి పాంప్లెట్లు పంచింది. అయినప్పటికీ ఉద్యోగులపై వ్యతిరేకత ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాలో పని గట్టుకుని కొంత మంది వైసీపీ కార్యకర్తలు నెగెటివ్ కామెంట్లు పెట్టారు కానీ.. పెద్దగా ఎఫెక్ట్ కనిపించలేదు.
ఓ రకంగా చలో విజయవాడ ఉద్యోగులకు ప్రజల మద్దతు కూడా లభిస్తుందన్న భరోసా కల్పించింది. నిజానికి ఉద్యోగులు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తే ప్రజల మద్దతు లభించేది కాదేమో కానీ.. తమ పాత జీతాలు తమకు ఇవ్వాలని కోరుతున్నారు కాబట్టి ప్రజలు కూడా రియలైజ్ అవుతున్నారు. ప్రభుత్వ లెక్కల గురించి ప్రజలకు ఇప్పటికే ఓ అవగాహన వచ్చింది కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని భావిస్తున్నారు.