తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకాల్సి ఉన్న సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే తన తరపున ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి తలసానిని పంపుతున్నారు. మోడీకి స్వాగతం, వీడ్కోలు కూడా ముఖ్యమంత్రి తరపున తలసాని శ్రీనివాస్ యాదవే చెబుతారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు పెద్దగా కేటాయింపులు చేయలేదని.. అలాగే అసలు బడ్జెట్ దేశానికి ఉపయోగపడదని కేసీఆర్ ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు.
ప్రధానమంత్రి మోడీని, బీజేపీని తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపైనా మండిపడ్డారు. దీంతో ప్రధాని పర్యటనలో కేసీఆర్ పాల్గొంటారా అన్నఅనుమానాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం వరకూ కేసీఆర్ పాల్గొంటారనే అధికారవర్గాలు చెప్పాయి. అయితే అనూహ్యంగా స్కిప్ చేయాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఇన్ని తీవ్రమైన విమర్శలు చేసిన తర్వాత మళ్లీ ప్రధాని మోడీకి స్వాగతం చెప్పి ఆయనతో సాధారణంగా వ్యవహరిస్తే కేసీఆర్ పోరాటం అంతా బూటకమేనని విపక్షాలు ప్రచారం చేస్తాయి.
ఇతర ప్రాంతీయ పార్టీల నేతలూ అలాగే అనుకుంటే జాతీయ రాజకీయాల్లో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అందుకే కేసీఆర్ వెనుకడుగు వేసినట్లుగా తెలుస్తోంది. అధికారికగా మోడీ పాల్గొనే కార్యక్రమాల్లోనూ కేసీఆర్ పాల్గొంటారో లేదో స్పష్టత లేదు. శనివారం తెలంగాణలో మోడీ పర్యటిస్తున్నారు.