ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధాని అని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో స్పష్టం చేసిన మూడు రోజుల వ్యవధిలోనే అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. అమరావతిలో భూమి తీసుకున్న ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్మాణాలు ప్రారంభించారు. తుళ్లూరు-రాయపూడి మధ్య నేషనల్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలాయనికి గత ప్రభుత్వం భూమి కేటాయించింది. రెండెకరాల స్థలంలో తొమ్మిది అంతస్తుల భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు.
కానీ తర్వాత ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడంతో నిర్మాణం ఆగిపోయింది. శంకుస్థాపన చేసిన రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిర్మాణ పనులను ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా సంస్థ తమ కార్యాలయం చుట్టూ ప్రహరి నిర్మాణ పనులు చేపట్టారు. రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాజధాని ఏదో ఖరారు చేస్తే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మిస్తామని ఆర్బీఐ నుంచి ఏపీకి సమాచారం వచ్చింది.
కేంద్రం అమరావతే రాజధాని స్పష్టత ఇవ్వడంతో ఇప్పుడు మిగతా కేంద్ర సంస్థలు కూడా నిర్మాణాలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట్లో ఎలా ఉన్నా ఇప్పుడు కేంద్రం కూడా అమరావతికే మొగ్గు చూపుతోందని బీజేపీ నాయకుల ఇటీవల ప్రకటనల బట్టి స్పష్టమవుతోంది. దీంతో అమరావతికి ఊపిరి వస్తోందని ఏపీ ప్రజలు ఆశిస్తున్నారు.