ప్రాణాలతో పోరాడి, గెలిచి… మళ్లీ పుట్టిన రోజు పండగ చేసుకోవడం ఎవరికైనా భావోద్వేగ భరితమైన సందర్భమే. కరోనా మహమ్మారి వల్ల, చాలామంది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పడి, అందులోంచి బయటపడి వచ్చారు. వాళ్లలో రాజశేఖర్ ఒకరు. సెకండ్ వేవ్ లో రాజశేఖర్ కుటుంబం మొత్తానికి కరోనా సోకింది. అందరూ త్వరగానే కోలుకున్నా, రాజశేఖర్ కి మాత్రం కష్టంగా గడిచింది. ఆక్సిజన్ అందక ఆయన ఆసుపత్రిలో చేరారు. చాలా ఇబ్బంది పడ్డారు. ఆ తరవాత కోలుకుని బయటకు వచ్చారు. ఈ దారుణమైన అనుభవాల్ని ఆయన మీడియాతో పంచుకున్నారు. “ఆ రోజుల్లో చాలా వరస్ట్ సెట్యివేషన్స్ లో ఉన్నా. చనిపోతానేమో అనిపించింది. కనీసం నడవలేకపోయేవాడ్ని. నా జీవితం అయిపోయిందన్న ఫీలింగ్ కలిగింది. బయటకు వచ్చినా, సినిమాలు చేస్తానని నమ్మలేకపోయా. భగవంతుడి దయ వల్ల.. కోలుకున్నా. ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నా. ఇదంతా ఓ కలలా.. అనిపిస్తోంద“న్నారు. ఈరోజు (ఆగస్టు 4) రాజశేఖర్ పుట్టిన రోజు. తను నటించిన `శేఖర్` త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. మలయాళ సూపర్ హిట్ చిత్రం `జోసెఫ్`కి ఇది రీమేక్. ఈరోజే విడుదల కావాల్సింది. కానీ వాయిదా వేశారు. త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటిస్తారు.