విడాకుల వ్యవహారాలు టాలీవుడ్ లో ఈమధ్య ఎక్కువగా నడిచాయి. నాగ చైతన్య – సమంత విషయంలో అయితే..మీడియాలో ఏదో వార్త హల్ చేస్తూనే ఉంది.. ఇప్పటికీ. ధనుష్ – ఐశ్వర్యలు విడిపోవడం కూడా షాకింగ్ వార్తే. ఓ స్టార్ హీరో కూతురు కూడా తన భర్తతో విడిపోయిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వీటి మధ్య.. కాస్త ఉపశమనం కలిగించే వార్త ఏమిటంటే… ఓ హీరో రెండో పెళ్లి చేసుకుంటున్నాడు.
హీరో ఇంటి నుంచే వచ్చి.. హీరో అయిన అతను, పెళ్లి చేసుకుని, సంసార జీవితంలో ఇమడలేక తన భార్యతో విడిపోయాడు. ఈ విషయాన్ని మీడియాకు, అభిమానులకూ తెలియజేశాడు కూడా. అదేంటో గానీ కొన్నేళ్లుగా ఆ హీరో కెరీర్ ఏమాత్రం సవ్యంగా లేదు. బాగా గ్యాప్ తీసుకుని కొన్ని సినిమాలు ప్లాన్ చేశాడు గానీ వర్కవుట్ కాలేదు. కొన్ని మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పుడు ఆ హీరో మళ్లీ సినిమాల్ని సీరియస్ గా తీసుకున్నాడటని టాక్. నిజ జీవితంలో కూడా ఓ అడుగు ముందుకు వేయబోతున్నాడ. తను మళ్లీ పెళ్లికి సిద్ధం అవుతున్నాడని తెలుస్తోంది. గతంలో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న తను.. ఈసారి ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడని, అయితే ఆ వ్యవహారం చివరి వరకూ రహస్యంగానే ఉంచాలనుకుంటున్నాడట. కెరీర్లో కూడా స్థిరపడ్డాక.. ఈ విషయాన్ని చెప్పాలని చూస్తున్నాడట. మరి ఆ శుభ ముహూర్తం ఎప్పుడో..?