జనసేన పార్టీ 20న మత్స్యకార అభ్యున్నతి సభను నర్సాపురంలో ఏర్పాటు చేసింది. దీనికి పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపల చెరువులపై మత్స్యకారులకు అధికారాలు తొలగించేలా ..వారి ఉపాధిని దెబ్బతీసేలా ఉన్న జీవో 217ను విడుదల చేసింది. దానికి వ్యతిరేకంగా జనసేన ఉద్యమం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే మత్స్యకార గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఫిబ్రవరి 13 నుంచి మత్స్యకార గ్రామాల్లో అభ్యున్నతి యాత్ర నిర్వహిస్తారు. ఫిబ్రవరి 20న సభ నిర్వహిస్తారు. పవన్ కల్యాణ్ హాజరవుతారు.
నిజానికి గత నవంబర్‌లో ప్రపంచ మత్స్యకార దినోత్సవం రోజునే దీన్ని నిర్వహించాలని అనుకున్నారు. కానీ అప్పుడు వర్షాల కారణంగా వాయిదా పడింది. మత్స్యకార సొసైటీల పేరుతో అన్నీ దళారుల చేతుల్లో ఉన్నాయని అందుకే జీవో తీసుకొచ్చి వేలం వేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 217ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేపల చెరువుల్ని వైసీపీ నేతలు తమ అధీనంలోకి తీసుకోవడానికే చేపల చెరువుల హస్తగతానికే బహిరంగ వేలం విధానాన్ని తెచ్చి, మత్స్యకారుల నోటికాడ కూడు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కూడా మత్స్యకారులకు భరోసా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే మత్స్యకారులు ఈ జీవోపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మత్స్యకారులకు మద్దతు పలికి పవన్ కల్యాణ్ వారిని జనసేనకు దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.