ఏపీ రాజకీయాల్లో ఏం జరిగినా ముందుగా కులం కోణం బయటకు వస్తుంది. కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడితే కులం అంటూ ఉంటాయి. చింతామణి నాటకం రద్దు విషయంలో రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారంటూ నర్సాపురంలోని ఆర్యవైశ్యులు గత మూడు, నాలుగు రోజులుగా ఆయన దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. దీంతో రఘురామకృష్ణ రాజు స్పందించారు. ఓ వీడియో విడుదల చేశారు. కళాకారులను దృష్టిలో పెట్టుకొని వారు జీవించే హక్కును కాలరాసే హక్కు ప్రభుత్వానికి లేదని పిటిషన్ దాఖలు చేశాను.. ఆర్య వైశ్యులు మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న సుబ్బిశెట్టి పాత్ర తీసివేసి లేదా పాత్ర పేరు మార్చాలి అనేది తన వాదన అని వివరమ ఇచ్చారు.
చింతామణి నాటిక లో సుబ్బిశెట్టి పాత్ర కు కులం పేరు లేకుండా మార్చుదామని.. తన పేరు పెట్టినా అభ్యంతరం లేదన్నారు. కొందరు ఆర్యవైశ్య ప్రముఖులను సంప్రదించి వారి సమ్మతితోనే చింతామణి నాటిక రద్దు పైన నేను కోర్టులో పిటిషన్ వేశానని గుర్తు చేశారు. చింతామణి నాటకం పై నేను వేసిన పిటిషన్ను ఒకసారి ఆర్యవైశ్యులు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. చింతామణి నాటిక పై నాతో పాటు మరొకరు పిటిషన్ కూడా వేశాని.. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే నా ఒక్కడి దిష్టిబొమ్మలు దగ్ధం చేయటానికి పిలుపునిచ్చారన్నారు.
సుబ్బారావు గుప్తాను కొట్టినప్పుడు నోరుమెదపని అధికార పార్టీ ఆర్యవైశ్య ప్రముఖులు ఇప్పుడు సీఎం ప్రోద్బలంతో రాజకీయ దురుద్దేశంతో నాపైన ఆందోళన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చారని ఆరోపించారు. సుబ్బారావు గుప్తా మానసిక ఆవేదన పట్టించుకోకుండా పిచ్చివాడిగా ముద్రవేశారని.. ఇప్పటికి నేను చేసింది బాధ అని భావిస్తే నా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన నాకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఆర్య వైశ్యుల్లో వైషమ్యాలను రెచ్చగొట్టేలా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని పసిగట్టాలని సలహా ఇచ్చారు. ఇప్పటికే రఘురామ ఏం మాట్లాడినా ఏదోఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా కేసులు పెట్టించే వ్యూహంలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు చింతామణి విషయంలో ఆయనపైకి ఆర్యవైశ్యుల్ని ఉసిగొల్పుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.