ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం వెళ్లి ఆహ్వానం పలకాలి. కానీ కేసీఆర్ వెళ్లడంలేదని ఓ సారి.. వెళ్తున్నారని ఓ సారి తెలంగాణ ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేశాయి. చివరికి ఆ ముహుర్తం వచ్చే సరికి కేసీఆర్కు జ్వరం వచ్చిందని అందుకే ప్రధానికి స్వాగతం పలకడానికి వెళ్లలేదని మీడియాకు సమాచారం ఇచ్చారు. అసలు మోడీ పర్యటనలో కేసీఆర్ పాల్గొనడంపై గతంలో ఎప్పుడూ ఇంత గందరగోళం లేదు. వెళ్తే వెళ్తామని చెబుతారు లేకపోతే లేదు. కానీ ఈ సారి కేసీఆర్ ఏటూ తేల్చుకోలేని పరిస్థితి ఉన్నట్లుగా ఉంది.
తన తరపున ప్రోటోకాల్ స్వాగతం పలికేందుకు మంత్రి తలసానికి అధికారం ఇస్తూ సీఎంవో నుంచి ఉత్తర్వులు వచ్చాయి. రాత్రికల్లాకొన్ని మీడియా సంస్థలకు అది ప్రోటోకాల్ లెటరేనని.. కేసీఆర్ హాజరవుతారని సమాచారం ఇచ్చారు. ఉదయం అంతా అదే ప్రచారం చేశారు. మధ్యాహ్నానికి సీన్ మారిపోయింది. జ్వరం కారణంగా కేసీఆర్ మోడీ కి స్వాగతం పలకడానికి వెళ్లలేదని తెలుస్తోంది. అయితే కేసీఆర్ను తన పర్యటనలో పాల్గొనవద్దని మోడీనే చెప్పారన్న ప్రచారం జరుగుతోంది.
స్వాగతం పలికే విషయంలో ఇబ్బందికరంగా వ్యవహరించడమే కాకుండా … తాను పాల్గొనే కార్యక్రమాల్లో కేసీఆర్ నిరసన వ్యక్తం చేయడం వంటివిచేస్తే ఇబ్బందికరమని మోడీ గుర్తించినట్లుగా భావిస్తున్నారు. అందుకే ఇక్రిశాట్లో జరిగినకార్యక్రమంలోనూ కేసీఆర్ ను వద్దని చెప్పారని అంటున్నారు. మొత్తంగా చూస్తే బీజేపీతో చేయాల్సిన రాజకీయాల వ్యూహంలో కేసీఆర్ గందరగోళానికి గురవుతున్నారన్న అభిప్రాయం టీఆర్ఎస్లోనే ఏర్పడుతోంది.