ఉమ్మడి పోరాటం పేరుతో తమను కూడా కలుపుకుని ప్రభుత్వానికి అమ్మేశారన్న అభిప్రాయానికి ఉపాధ్యాయులు వచ్చారు. పీఆర్సీ సాధన సమితిలో వారు కూడా ఉన్నారు. కానీ వారు మంత్రుల కమిటీతో జరిగిన భేటీలో ప్రభుత్వ ప్రతిపాదనల్ని అంగీకరించలేదు. తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఉద్యోగ నేతలు మాత్రమ మెజార్టీ అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకున్నామని చెప్పి సమ్మె విరమణ ప్రకటన చేసేశారు. దీంతో ఉపాధ్యాయ నేతలకు మండిపోయింది. వెంటనే వారు ఉద్యోగనేతల దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు.
తమ పోరాటం తాము చేసుకుంటామని.. ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించే ప్రశ్నే లేదని చెబుతున్నారు. నిజానికి రోడ్డెక్కుతున్న ఉద్యోగుల్లో అత్యధికులు ఉపాధ్యాయులే. వారి పోరాటం వల్లనే ఉద్యమ వేడి కనిపిస్తోంది. ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనల వల్లే ప్రభుత్వం కాస్త దిగి వచ్చింది. దీన్ని కూడా ఉద్యోగ నేతలు ప్రభుత్వానికి తాకట్టు పెట్టినట్లుగా వ్యవహరించడం వివాదాస్పదమవుతోంది. నిజానికి ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ అసంతృప్తి ఉంది.
వాట్సాప్ గ్రూపుల్లో వారు ఉద్యోగ సంఘ నేతలపై మండి పడుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు ఏమి చెప్పినా… ఉద్యోగులు ఎలా స్పందిస్తారన్న అంచనా ఉంది. టీచర్లు మాత్రం తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. వారి డిమాండ్లలో ఒక్కటీ నెరవేరలేదు. అందుకే అయిపోలేదు.. ఇంకా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.