కష్టాలున్నా బడ్జెట్ ప్రకారమే బండి నడుపుతున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెబుతున్నారు కానీ.. ఎక్కడా ఆ బడ్జెట్ లెక్కలకు వాస్తవానికి పొంతన ఉండటం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలలకు సంబంధించిన లెక్కలను కాగ్ విడుదల చేసింది. ఇందులో ఈ ఏడాది బడ్జెట్లో ఐదు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు. కానీ తొమ్మిది నెలల్లో ఆ లోటు ఏకంగా రూ. 46 వేల కోట్లకు చేరిపోయింది. ఇది 918 శాతం. ఇంత భారీ స్థాయిలో లోటు పెరుగుతున్నా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.
ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతూనే ఉంది. డిసెంబర్ వరకు రూ. 1,56,029 కోట్లు వచ్చింది. ఇది గతేడాదికన్నా 2.3 శాతం ఎక్కువగా ఉంది. రాష్ట్ర సొంత పన్నులు డిసెంబర్ వరకు రూ. 69,943 కోట్లు వచ్చింది. ఇది గతేడాదికన్నా ఏకంగా 10.14 శాతం ఎక్కువ. రూ. 1,55,376 కోట్ల మేర ఖర్చు చేశారు. ప్రభుత్వం ఎన్ని చెబుతున్నా ప్రణాళికా వ్యయం మాత్రం తగ్గిపోతూనే ఉంది. సాధారణ రంగం, ఎకనామిక్ రంగాల్లో గత ఏడాది కన్నా తక్కువ వ్యయం చేశారు.
ఇక ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో రూ. 50,525 కోట్లు రుణంగా తీసుకున్నారు. తీసుకున్న రుణాలపై డిసెంబర్ వరకు చెల్లించిన వడ్డీ రూ. 15,291 కోట్లుగా తేలింది. గత ఏడాది 142 శాతం అధికంగా ద్రవ్యలోటు నమోదుకాగా.. ఈ ఏడాది 157 శాతానికి పెరిగింది. ఇప్పటికీ ఆర్బీఐ వద్ద ఓడీ, వేస్ అండ్ మీన్స్, స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ లాంటివి గరిష్టంగా వాడుకుంటున్నారు. ఇది మరింత భారం అవుతోంది.