పంజాబ్ సీఎం పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు రాహుల్ గాంధీ షాకిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా ప్రస్తుత సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీనే ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటించారు. ఇప్పటికే తనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని.. ప్రకటించేలా చేయాలని సిద్ధూ చాలా రకాలుగా ఒత్తిడి ప్రకటనలు చేస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ పంజాబ్ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని చన్నీనే సీఎం అభ్యర్థిగా ఖరారు చేశారు.
గత ఎన్నికలకు సమయంలోనూ సిద్దూ సీఎం అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ పీఠాన్ని దక్కించుకున్నారు. సిద్దూకు మంత్రి పదవి దక్కినా సిద్ధూ తర్వాత టీవీ షోల కోసం రాజీనామా చేసి సైలెంట్ అయిపోయారు. ఇటీవలే మళ్లీ ఆయన యాక్టివ్ అయ్యారు. పంజాబ్ పీసీసీ చీఫ్ అయ్యారు. అయితే ఆయన యాక్టివ్ అయినప్పటి నుండి పంజాబ్ కాంగ్రెస్లో రచ్చ ప్రారంభమయింది. చివరికి కెప్టెన్ను పదవి నుంచి దింపేయాల్సి వచ్చింది. ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు.
కెప్టెన్ తర్వాత సిద్ధూకు సీఎం పదవి ఇవ్వలేదు. దళిత నేత అయిన చరణ్ జీత్ సింగ్ చన్నీకి రాహుల్ పట్టం కట్టారు. కొద్ది కాలమే అయినా చన్నీ పాలనలో ప్రజల్ని ఆకట్టుకున్నారు . దీంతో ఆయనకుప్రజల మద్దతు లభించింది. అదే సమయంలో సిద్దూ వ్యవహారశైలిపై కాంగ్రెస్ హైకమాండ్ కూడా అసంతృప్తిగా ఉంది. ఆయనతో పెట్టుకుంటే ఇంకా ఇంకారచ్చ అవుతుందన్న భావనతో ఉన్నట్లుగా ఉన్నారు. దీంతో ఎన్నికలకు ముందు క్లారిటీ ఇవ్వాలనుకున్న రాహుల్.. చన్నీ పేరును ప్రకటించేశారు.