తెలంగాణ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే ఆంధ్రప్రదేశ్‌లో 2019లో ఎన్నికలకు ఏడాదిన్నర ముందు జరిగిన పరిణామాలు గుర్తుకు వస్తున్నాయి. బీజేపీతో ఉన్న సన్నిహిత సంబంధాలను తుంచేసుకున్న టీడీపీ మోడీపై విరుచుకుపడుతూ కదన రంగంలోకి దిగింది. అప్పట్నుంచి ఆ పార్టీ నేతలకు తీరిక లేదు.. బీజేపీ నేతలకు అలుపు లేదు. ప్రభుత్వం తరపున అధికారికంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాని మోడీ వస్తే గో బ్యాక్ నినాదాలు చేశారు. చంద్రబాబు మోడీ పర్యటనకు డుమ్మా కొట్టారు. విభజన హామీలను నెరవేర్చలేదంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. వివక్ష చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నాయి.
ముందు ముందు ఢిల్లీలో ధర్నాలు, ప్రధాన మంత్రి ఇళ్ల ముట్టడులుకూడా ఉంటాని టీఆర్ఎస్ నేతలు సంకేతాలు ఇస్తున్నారు . ఇవి కూడా తెలుగుదేశం పార్టీ చేసినవే. ఎలా చూసినా తెలంగాణలో పరిస్థితులు… 2019కి ముందు ఏపీలో ఉన్నట్లుగా సరిపోలుతున్నాయి. చంద్రబాబు తన వ్యూహాన్ని అమలు చేసి ప్రాంతీయ పార్టీలతో కలిసి జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఎదగాలనుకున్నారు. కానీ ఆయన ప్లాన్ బెడిసికొట్టి మొదటికే మోసం వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ కూడా దాదాపుగా అదే ప్రణాళికతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రాంతీయపార్టీల నేతలతో వరుసగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు.
అయితే చంద్రబాబు అప్పుడు ఎదుర్కొన్న అనుభవాలు కేసీఆర్‌లో మార్పు తీసుకు రాలేకపోయిందా లేకపోతే.. తప్పని పరిస్థితుల్లో అలా చేయాల్సి వస్తుందా అన్నదానిపై మాత్రం రాజకీయవర్గాలకు క్లారిటీ లేదు. ఏపీలో టీడీపీని దెబ్బకొట్టడమే బీజేపీ లక్ష్యం కాబట్టి అది వైసీపీ గెలుపు కోసం లాభించింది. కానీ తెలంగాణలో పరిస్థితి వేరు. ఇక్కడ బీజేపీ ఆశలు పెట్టుకుంది.తనకే గెలుపు వస్తుందంటే ఇక ఎంత మాత్రం బీజేపీ వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. ఈ విషయం గుర్తించే కేసీఆర్ గతంలో ఇతరుల అనుభవాలు అంత క్లారిటీగా లేకపోయినా ధైర్యంగా ముందడుగు వేస్తున్నట్లుగా భావిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఫలితం సాధిస్తే మరోసారి ఆయన పేరు మార్మోగిపోతుంది. లేకపోతే ఇంత కాలం సాధించిన ఇమేజ్ అంతా గంగలో కలిసిపోతుంది. ఇదంతా ఎందుకు అని మధ్యలో రియలైజ్ అయి బీజేపీతో కలిసిపోతే ఏం జరుగుతుందో చెప్పడం కష్టం.