మూడు రాజధానుల బిల్లులు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను ఉపసంహరించుకున్న తర్వాత ప్రభుత్వం తీరుపై చాలా అనుమానాలొచ్చాయి. మళ్లీ మూడు రాజధానుల బిల్లులు పెడతామని ప్రభుత్వం చెబుతోంది కానీ.. అమరావతి భూములు కోట్లకు కోట్లు చేస్తాయని తాకట్టు పెట్టడం ప్రారంభించేసింది. సీఆర్డీఏకి రాజధానికి రైతులు ఇచ్చిన భూముల్లో వచ్చిన వాటాలో 480 ఎకరాల భూముల్ని ప్రభుత్వం తాకట్టు పెట్టేసింది. మూడు రోజుల కిందట ఉద్యోగులు పెన్ డౌన్ చేసినప్పుడే రాజధానిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల సిబ్బందిని రప్పించి పని పూర్తి చేసేసినట్లుగా తెలుస్తోంది. కానీ ఎవరికి తాకట్టు పెట్టారు.
ఎంతకి తాకట్టు పెట్టారు.. పాత వాటికి గ్యారంటీగా ఇచ్చారా.. కొత్త వాటికా అన్న స్పష్టత మాత్రం రాలేదు. ప్రభుత్వమే చెప్పాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం ఇటీవల స్మార్ట్ టౌన్ షిప్స్ పేరుతో ప్లాట్లు వేసి అమ్ముతోంది. అందు కోసం నవులూరు దగ్గర ప్రభుత్వ భూమిని చదును చేసి ప్లాట్లు వేస్తున్నారు. వేయక ముందే అమ్మకానికి పెట్టారు అది వేరే విషయం. అయితే ఆ భూమి తనఖాలో ఉంది. ఇప్పుడు ఆ భూమి విషయంలో ముందుకు వెళ్లాలంటే తనఖా నుంచి విడిపించారు. అలా చేయాలంటే డబ్బులు ఉండాలి. అవే ఉంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు అనుకున్నారేమో కానీ.. భూమికి బదులుగా భూమి రిజిస్ట్రేషన్ చేసిచ్చినట్లుగా తెలుస్తోంది.
నేరుగా రాజధాని భూములు అమ్మకానికి పెడితే న్యాయపరమైన సమస్యలు వస్తాయి. అందుకే ఇలా అడ్డదారిలో ఇతర భూమి అమ్మేస్తూ.. ఆ భూమిపై ఉన్న రుణానికి రాజధాని భూముల్ని తనఖా పెడుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ప్రభుత్వం అయితే రాజధాని భూముల నుంచి తైలం పిండటం ప్రారంభించేసింది. ఇక రెండున్నరేళ్ల సమయం ఉంది. చివరి వరకూ ఏమైనా మిగులుతాయో లేదో ఆ టైం వస్తే కానీ తెలియదన్న ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది.