ప్రభాస్ – మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా సెట్టయిన సంగతి తెలిసిందే. మూడు నెలల్లో సినిమా తీసి ఇవ్వాలన్న టార్గెట్ తో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. ఇలాంటి విషయాల్లో మారుతి సిద్ధహస్తుడు. ఇప్పటికే.. ప్రభాస్ కి ఓ లైన్ వినిపించేశాడు. ఇప్పుడు స్క్రిప్టు పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు. ఇదో హారర్ సినిమా అని, థ్రిల్లర్ అని, ఫ్యామిలీ డ్రామా అని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇదో థ్రిల్లర్ అని తెలుస్తోంది. `ప్రేమకథా చిత్రమ్` లాంటి కథ అని, అయితే ఈ సినిమాలో దెయ్యం మాత్రం ఉండదని, కానీ అలాంటి ఫీల్ మారుతి కలగజేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ ని తీర్చిదిద్దబోతున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో గానీ, కోకా పేటాలో ఉన్న అల్లు స్టూడియోలో గానీ ఈ సెట్ వేస్తారట. సినిమాలోని దాదాపు 50 నుంచి 60 శాతం ఇక్కడే పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఏప్రిల్ లో సెట్ నిర్మాణం మొదలు పెడతారు. దానికి ఓ నెల రోజులు కేటాయించినా, మే నాటికి సెట్ పూర్తవుతుంది. అంటే.. మారుతి సినిమా మే – జూన్లలో మొదలయ్యే ఛాన్సులున్నాయి. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని సమాచారం. ప్రస్తుతం వాళ్ల కోసం అన్వేషణ జరుగుతోంది.