టాలీవుడ్‌కు డ్రగ్స్ కేసు నీడలా వెంటాడుతోంది. ఎలాగోలా సర్దుబాటు అయిపోయింది.. క్లీన్ చిట్ వచ్చేసిందని ఊపిరి పీల్చుకున్న వారికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కొత్తగా ఆందోళన కలిగిస్తున్నాయి. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో డిజిటల్ ఆధారాలు ఈడీకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో కథ కొత్త మలుపు తిరిగింది. గతంలో ఈడీకి తెలంగాణ ఎక్సైజ్ శాఖ సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఎఫ్ఐఆర్లు మాత్రమే ఇచ్చారు. కాల్ లిస్టులు.. లావాదేవీల ఆధారాలు ఇవ్వలేదు. ఇప్పుడు వాటిని హ్యాండోవర్ చేశారు. హైకోర్టు ఆదేశాలతో మిగిలినవి ఏమైనా ఉంటే అవీ ఇవ్వాల్సి ఉంటుంది.
పైగా హైదరాబాద్ కొత్త కమిషనర్ సీవీ ఆనంద్ వచ్చాక టోనీ అనే స్మగ్లర్ ను పట్టుకుని బడా వ్యాపారవేత్తల గుట్టు రట్టు చేశారు. ఆ వివరాలు ఈడీకి ఇచ్చారు. అడగకుండానే ఇచ్చి మనీ లాండరింగ్ దర్యాప్తు చేయాలన్నారు. ఈ కేసులోనూ ఈడీ రంగంలోకి దిగడం ఖాయమయింది. కెల్విన్‌కు.. టోనీకి లింకులు ఉన్నట్లుగా అధికారులకు ఇప్పటికే ఆధారాలు దొరికాయన్న అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో ఈడీ అధికారులు మళ్లీ టాలీవుడ్‌ను చుట్టుముట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
అసలు టాలీవుడ్ డ్రగ్స్ కేసు మొత్తం కాల్ లిస్ట్ చుట్టూనే తిరిగింది. రవితేజ సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతని ఫోన్లో దొరికి న సమాచారం ఆధారంగా అప్పట్లో కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఆ సమాచారన్నే ఈడీకి ఇవ్వాల్సి వస్తోంది. అయితే ఈడీ దర్యాప్తు చేసేది కేవలం.. మనీలాండరింగ్ కోణంలోనే. కానీ మనీలాండరింగ్ చేసినట్లు తేలితే డ్రగ్స్ లావాదేవీలు నిర్వహించినట్లే తేలుతుంది. అదే ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులకు ఆందోళన కలిగించే అంశంగా మారింది.