కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టును ప్రైవేటుకు ఇచ్చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. దీనిపై విద్యుత్ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. అయితే ఇప్పుడు ఆ పని చేయాలంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరించాలి. ఎందుకంటే ఆ పవర్ ప్లాంట్లో తెలంగాణకూ వాటాలున్నాయి. కృష్ణపట్నం ప్లాంట్లో ఎపి జెన్కోకు 51శాతం, ఎపి ప్రభుత్వానికి 4శాతం, తెలంగాణ డిస్కంలకు 27శాతం, ఎపి డిస్కంలకు18శాతం భాగస్వామ్యంగా ఉన్నాయి. తెలంగాణ అభిప్రాయంతో సంబంధం లేకుండా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
కృష్ణపట్నం ప్లాంట్ బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రతినిధులు ప్రైవేటీకరణ అంశంపై అభ్యంతరం ంవ్యక్తం చేసారు. తమకు తెలియకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. పూర్తిస్థాయిలో తమ అభిప్రాయాలను చెప్పడానికి తమకు కనీసం రెండు వారాల సమయం కావాలని కోరారు. అంటే ప్రభుత్వం అంగీకరిస్తేనే తెలంగాణ అధికారులు ఓకే చెబుతారు. లేదంటే లేదు. కరెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది. తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం వచ్చే పరిస్థితి ఉన్నా అంగీకించదు.
ఖర్చు ఎక్కువైపోయిందని నష్టాలు వస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ప్లాంట్ నిర్వహణ జెన్కోకు కష్టంగా ఉందని, నిర్వహణ ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని నిర్ణయింంచారు. కృష్ణపట్నం విషయంలో అంతా ఓ వ్యూహాత్మకంగా చేస్తున్నారని ముందు నష్టాల బాట పట్టించి ఆ తర్వాత అమ్మకానికి పెడుతున్నారన్న అభిప్రాయం ఉద్యోగుల్లో ఉంది. ఏపీలో ఉన్న విద్యుత్ సంస్థలో తమకు ఉన్న వాటాలను పోగొట్టుకోవడానికి తెలంగాణ సర్కార్ అంగీకరించకపోవచ్చని చెబుతున్నారు. అయితే అత్యధిక శాతం వాటాలు ఏపీ సర్కార్కు ఉన్నందున తెలంగాణ అభిప్రాయంతో పని లేదని ముందుకు వెళ్తే… అది రెండు రాష్ట్రాల మధ్య మరో వివాదానికి కారణం అయ్యే అవకాశం ఉంది.