ఏపీ ప్రభుత్వం చేపట్టిన నగదు బదిలీ పథకాల్లో ఒకటి చేదోడు. రజక, నాయీబ్రాహ్మణ, టైలర్లకు రూ. పదివేలు ఇచ్చే పథకమే చేదోడు. గత ఏడాది ఓ సారి నిధులు ఇచ్చారు. రెండో సారి ఈ రోజు విడుదల చేస్తున్నారు. 2.85 లక్షల మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు రూ. 285 కోట్లను విడుదల చేయనున్నారు. కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం వైఎస్ జగన్ నగదు బదిలీ చేయనున్నారు. ఈ దఫా షాపులున్న 1.46 లక్షల మంది టైలర్లకు రూ.146 కోట్లు, షాపులున్న 98వేల మంది రజకులకు రూ.98.44 కోట్లు, షాపులున్న 40వేల మంది నాయీ బ్రాహ్మణులకు రూ.40 కోట్ల నగదును లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.
రెండు విడతల్లో చేదోడు కింద ప్రభుత్వం రూ.583 కోట్లు విడుదల చేసినట్లవుతుంది. అయితే ప్రభుత్వం లబ్దిదారుల సంఖ్య అతి తక్కువగా చూపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. నాయీ బ్రాహ్మణలు ప్రతీ వీధిలోనూ ఉంటారు. ప్రతీ ఊరులోనూ ఉంటారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా వారి సంఖ్య 40వేలు మాత్రమే ఉన్నట్లుగా చెబుతున్నారు. అంటే ఒక్కో నియోజకవర్గానికి 200 మందికి కూడా ఇవ్వడం లేదన్నట్లే.
దీనికి కారణం నిబంధనలే. సొంత షాపు ఉండాలి . లైసెన్స్ తీసుకోవాలి.. కార్మిక శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి పన్నులు కట్టి ఉండాలన్న షరతులతో ఎక్కువ మంది అర్హత సాధించలేకపోయారు. అయితే పథకం ఉద్దేశం పేదల్ని ఆదుకోవడం కాబట్టి ఆదుకోకుడా ఇలాంటి నిబంధనలతో అనర్హుల్ని చేయడం ఏమిటన్న విమర్శలువస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ ఫీడ్ బ్యాక్ను పెద్దగా పట్టించుకోవడం లేదు.