ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనా పరరమైన పర్యటనలు గత రెండున్నరేళ్లలో చేసిన దాఖలాలు లేవు. ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్లు దొరకడం లేదన్న అసంతృప్తి ఉందని వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం జగన్ చాలా తీరిక చేసుకుంటున్నారు. అలాంటి వాటిలో ప్రధానంగా స్వామిజీల కార్యక్రమాలు. తెలంగాణ నుంచి చినజీయర్ కానీ.. ఏపీ నుంచి శారదా పీఠం స్వామి కానీ పిలిస్తే చాలు కాదనకుండా వెళ్లి వస్తున్నారు. నిన్న సమతామూర్తి ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్లిన జగన్ రేపు శారదాపీఠానికి వెళ్లనున్నారు.
ప్రస్తుతం శారదా పఈఠంలో వార్షిక మహోత్సవాలు జరుగుతున్నాయి. తమ పీఠం జగన్మాత రాజశ్యామల అమ్మవారి ఉపాసన పూర్తిస్థాయిలో తెలిసిన ఏకైక పీఠం అని స్వరూపానంద ప్రత్యేక బ్రాండ్‌గా ప్రచారం చేసుకుంటున్నారు. 14 ఏళ్ళ పాటు హిమాలయాల్లో సంచరించిన సమయంలో రాజశ్యామల అమ్మవారి తంత్రాన్ని తెలుసుకోగలిగానని స్వరూపానంద చెబుతున్నారు. ఈ సారి భారీగా కార్యక్రమాలు చేయకపోయినా పీఠంతో అనుబంధంగా ఉంటున్నందున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాకను స్వాగతించినట్లు ఆయన చెప్పారు.
స్వరూపానంద చెప్పినట్లుగా సీఎం జగన్ కు స్వరూపానంద పీఠంపై ప్రత్యేకమైన అభిమానం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక యాగం చేశారు. తన యాగం వల్లనే సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యారని స్వరూపానంద కూడా చెప్పుకున్నారు. జగన్కుఅలాంటి అభిప్రాయం ఉందో లేదో స్పష్టత లేదు కానీ స్వరూపానందపై మాత్రం అభిమానం ఉంది. అందుకే తిరుమల , విశాఖల్లో పీఠాలకు సంబంధించి ఆక్రమణలను క్రమబద్దీకరించారు. విశాఖలో కొత్తగా స్థలాలు కేటాయించారు. ఇప్పుడు పిలవగానే వేడుకలకూ వెళ్తున్నారు.