టాలీవుడ్లో ఓ కీలకమైన జరగాల్సివుంది. సోమవారం ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. కానీ సోమవారం జరగలేదు. మంగళవారం నాటికి వాయిదా పడింది. అయితే ఈరోజూ ఈ మీటింగ్ జరగడం లేదు. ఈ మీటింగ్ కి కచ్చితంగా రావాల్సిన సభ్యులు కొందరు అందుబాటులో లేకపోవడం వల్ల మీటింగ్ వాయిదా పడుతూ వస్తోందన్నది టాక్. కాకపోతే అంతర్గతంగా కారణాలేమైనా ఉన్నాయా? అనేది తేలడం లేదు.
చిరంజీవి ఈ మీటింగ్ పై చాలా ఆసక్తి చూపిస్తున్నారు. సినిమావాళ్లందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి, ప్రభుత్వానికీ, సినిమా పరిశ్రమకు ఉన్న గ్యాప్ ని తగ్గించాలన్నది చిరు ప్రయత్నం. అందుకే ఆయనే స్వయంగా రంగంలోకి దిగి, చిత్రసీమలోని ప్రముఖులకు ఫోన్లు చేసి సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. చాలామంది ఫోనుల్లో `వస్తాం..` అని మాటిచ్చినా, తెల్లారేసరికి `అందుబాటులో లేం` అంటూ సమాధానం ఇస్తున్నారని తెలుస్తోంది. దాంతో.. మీటింగ్ వాయిదా పడుతూ వెళ్తోంది. `మీలో మీరు మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రండి..` అంటూ సీఎం జగన్ చిరుతో అన్నారని. అందుకోసం చిరు ప్రయత్నిస్తుంటే, ఎవరూ కలసి రావడం లేదని తెలుస్తోంది. వీళ్లంతా కూర్చుని మాట్లాడుకునేది ఎప్పుడు? ఏకాభిప్రాయంతో జగన్ ని కలిసేదెప్పుడు? జగన్ తో ఇవన్నీ చర్చించి, పరిశ్రమకు అనుకూలమైన ఓ నిర్ణయం తీసుకునేది ఎప్పుడు? ఇవన్నీ అందుబట్టని ప్రశ్నలే. చిరంజీవే స్వయంగా రంగంలోకి దిగి, అందరినీ కలుపుకునిపోవాలని ప్రయత్నిస్తున్నా, మీటింగ్ సాధ్యం కావడం లేదంటే ఆశ్చర్యకరమైన విషయమే.