జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్లడానికి కొత్త దారి ఎంచుకున్నారు. ఎన్నికల ర్యాలీలు… ప్రచార కార్యక్రమాలు.. ప్రజా పోరాటయాత్రలు కాకుండా ఈ సారికొత్తగా ఆలోచించారు. నారసింహ యాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. కొండగట్టు నుంచి మొదలు పెట్టాలని .. తెలుగు రాష్ట్రాల్లో 30 నరసింహా ఆలయాలను సందర్శించాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ది కాంకిస్తూ ఈ ఆలయాల యాత్ర అని పవన్ కల్యాణ్ జనసేన సోషల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ప్రకటించారు.
పవన్ కల్యాణ్ చాలా బిజీగా ఉంటున్నారు. సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన ప్రజల్లోకి రావడం లేదన్న అభిప్రాయం ఉంది.అందుకే వ్యూహాత్మకంగా ఆయన రాజకీయంగా కాకుండా ఆలయాలయాత్రను ఎంచుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. ఇదే ఇంటర్యూలో ఆయన తనపై అధికార పార్టీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. తాను ప్రజల దత్త పుత్రుడనని పవన్ కల్యాణ్ సీఎం జగన్కు కౌంటర్ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాట్లాడతానన్నారు. ఉద్యోగుల సమ్మె పై మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు.
హామీ ఇచ్చి మాట తప్పారు కాబట్టే సమ్మె చేస్తామని అన్నారని.. ఉద్యోగుల సమస్యలు నేనో … విపక్షాలో సృష్టించింది కాదని గుర్తు చేశారు. మంత్రులే ఉద్యోగులను రెచ్చగొట్టారని ప్రభుత్వానికి అందరూ శత్రువులుగా కనిపిస్తారని ఎద్దేవా చేశారు. డూ డూ బసవన్న లు మీకు కావాలన్నారు. సజ్జల తన వ్యాఖ్యలపై వేటకారాలు ఆపి పని చూసుకోవాలని సలహా ఇచ్చారు.