భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కార్యకర్తల నుంచి విరాళాలు సేకరిస్తోంది. పార్టీని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ పని చేస్తోంది. బీజేపీకి విరాళం ఇస్తే దేశానికి బలం ఇచ్చినట్లేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఆ పార్టీకి దేశంలోని బలవంతులందరూ విరాళాలిచ్చి అత్యంత బలిష్టంగా మార్చేశారు. అసోసియేషన్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ అన్ని అధికారిక పత్రాలను చూసి భారతీయ జనతా పార్టీకి కుబేర పార్టీగా తీర్మానించింది. ఫిక్స్డ్ డిపాజిట్లు.. స్థిరాస్తులు అన్నీ కలిపి దాదాపుగా రూ. ఐదు వేలకోట్ల ఆస్తులు బీజేపీకి ఉన్నాయి.
బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు మాత్రమే. ఇంత స్వల్ప కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ..అదీ వేల కోట్లలో విరాళాలు ఎలా వచ్చాయి..? ఎవరు ఇచ్చారు..? ఎలా ఇచ్చారు? ఇచ్చినా బీజేపీ పట్టనంతగా ఎందుకు తీసుకుంది? ఇవన్నీ తెలుసుకోకూడదని.. తెలియనివ్వని సందేహాలు. హైదరాబాద్ కు చెందిన మేఘా సంస్థ గత ఏడాది ఒక్క బీజేపీకే అధికారికంగా రూ. ఇరవై రెండు కోట్ల విరాళిలిచ్చినట్లుగా ప్రకటించింది. ఈ సంస్థపై గత ఏడాది దాదాపుగా పది రోజుల పాటు ఐటీ, ఈడీ సోదాలు జరిగాయి. రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చేందుకు బీజేపీ రాగానే ఎలక్టోరల్ బాండ్లు అనే విధానాన్ని తెచ్చింది. దీని ద్వారా ఎవరు ఇస్తున్నారో సీక్రెట్‌గా ఉంచొచ్చు. అందుకే సీక్రెట్‌గా కంపెనీలు వేల కోట్లు విరాళిలిస్తున్నాయి.
దేశంలో మరే రాజకీయ పార్టీకి రూ. వెయ్యి కోట్లు కాదు కదా.. కనీసం ఐదు వందల కోట్ల వరకూ స్థిరాస్తులు లేవు. దేశాన్ని దశాబ్దాల పాటు పరిపాలించిన కాంగ్రెస్‌కు ఐదు వందల కోట్ల ఆస్తులు కూడా లేవు. ఆ పార్టీకి ఇప్పుడు విరాళాలు ఇచ్చే వారు కూడా లేరు. అందరూ బీజేపీ.. అధికార పార్టీలకే ఇస్తున్నారు. ఈ మతలబేంటో.. కానీ ఇప్పుడు కార్యక్తల నుంచి కూడా విరాళాలు సేకరిస్తోంది బీజేపీ. బీజేపీ ఆస్తుల లెక్కలు చూసిన వారికి.. ఇప్పుడు చేస్తున్న విరాళాల తీరు చూసిన వారికి.., వారు బీజేపీ కార్యకర్తలైనా సరే.. కాస్త ఆశ్చర్యపోక మానరు.