సెంటిమెంటే టీఆర్ఎస్ అస్త్రం. తెలంగాణ సెంటిమెంట్‌తో టీఆర్ఎస్ ఘన విజయాలు సాధిస్తూ వస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటి వరకూ సాధించిన విజయాలన్ని తెలంగాణ సెంటిమెంట్ పునాదుల మీదనే వచ్చాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యేక రాష్ట్ర నినాదంతో టీఆర్ఎస్ భారీ విజయాలు నమోదు చేసింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా అదే సెంటిమెంట్ వర్కవుట్ అయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు దూకుడుతో కేసీఆర్ సెంటిమెంట్ రాజేసి మంచి ఫ లితాలు సాధించారు.
అయితే ఇటీవల సెంటిమెంట్ తగ్గిందన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు పార్లమెంట్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలతో మరోసారి అ అస్త్రాన్ని తన అమ్ములపొదిలో చేర్చేందుకు టీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేయడం ప్రారంభించారు. బీజేపీ గెలిస్తే ఏపీ, తెలంగాణను మళ్లీ కలిపేస్తారన్న ప్రచారాన్ని టీఆర్ఎస్ నేతలు ఉధృతం చేస్తున్నారు. తలసాని, హరీష్ రావు లాంటి వాళ్లే మళ్లీ బీజేపీ వస్తే ఏపీ, తెలంగాణలను కలిపేసినా కలిపేస్తారన్న ఓ ప్రచారాన్ని ప్రజల్లోకి పంపేందుకు పదే పదే ఆ ప్రకటనలు చేస్తున్నారు.
టీఆర్ఎస్కు అంతకు మించిన గొప్ప సెంటిమెంట్ అస్త్రం దొరకదు. అయినా ముందుకెళ్తోంది. ఎంత మేర ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయితే అంత ఫలితం వస్తుంది. రాజకీయాల్లో విజయాలు అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే వస్తాయి. అలాంటి అవకాశం వచ్చిందని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే శక్తివంచన లేకుండా కార్యక్రమాలు చేసతున్నారు. మరి వర్కవుట్ అవుతుందో లేదో ?