మనం పురోగమిస్తున్నామా ? తిరోగమిస్తున్నామా ?
ఈ రోజు ఉన్నదాని కన్నా కాస్త జ్ఞానం పెంచుకుని ఓ అడుగో.. రెండు అడుగులో ముందుకు వేస్తే .. ఆలోచనలను ఉన్నతం చేసుకుని మనుషుల్ని దగ్గర చేసుకునే విధంగా నడవడిక మార్చుకుంటే … మన పూర్వికుల కన్నా మరింత మెరుగ్గా మనుషులంతా ఒక్కటే అన్న భావన పెంచుకుంటే పురోగమిస్తున్నట్లు..! అలా కాకుండా చదవేస్తే ఉన్న మతి పోయిందనట్లు రోజు రోజుకూ అజ్ఞానాన్ని మెదడు నిండా జమ చేసుకుంటూ మనుషుల మధ్య దూరాన్ని పెంచుకుంటూ మన పూర్వికులు చెప్పిన అభ్యుదయాలను కూడా తప్పు పట్టే పరిస్థితికి చేరుకుంటే తిరోగమిస్తున్నట్లు ! ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న విషయాలను ఒక్క సారిగా తల ఎత్తి పరికించి చూస్తే పురోగమిస్తున్నామా ? తిరోగమిస్తున్నామా ?. అనే సందేహం ఖచ్చితంగా రాక మానదు.
హిజాబ్ లేదా బురఖా ముస్లిం విద్యార్థులు కొత్తగా ధరిస్తున్నారా !?
మత విశ్వాసాల జోలికి వెళ్లవద్దు. చరిత్రలో ప్రవక్తలు.. సాధువులు .. మహానుభావులు.. మతోద్దారకులు ఏం చెప్పారన్న సంగతి కూడా వదిలేద్దాం. కేవలం ఈ సమాజంలో మనం ఏం చూశామన్నది ఓ సారి తెరిపారా గుర్తు చేసుకుంది. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో కులంలో.. మతంలో..వర్గంలో పుట్టి ఉంటారు. ఆ మాటకొస్తే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ. ఈ సంఘజీవనంలో కొంత మంది సమూహం కలిసి ఓ ఆచారం పెట్టుకున్నారు. దానికి సైంటిఫిక్‌గా ఏమైనా కారణాలున్నాయో లేదో విశ్లేషించి చెప్పేవారు.. చెప్పినంత మనం అవగాహన చేసుకుంటాం. మనం చిన్న తనం నుంచి అనేక మంది విభిన్నమతాలు, వర్గాలు, కులాల వారిని చూసి ఉంటాం. ముస్లిలంను కూడా చూసి ఉంటాం. ముస్లిం మహిళలు బురఖాలు వేసుకోవడం లేదా హిజాబ్ ధరించడం ఎప్పుడూ చూడలేదా ? అది తప్పు అని ఎప్పుడైనా అనుకున్నామా?. ముస్లింలలో మగవాళ్లు గడ్డాలు పెంచుకుంటారు.. ఆడవాళ్లు బయటకు వెళ్తే బరఖాలేసుకుంటారు లేకపోతే హిజాబ్ కట్టుకుంటారు.. బ్రహ్మణులు శిఖ అంటే పిలక పెంచుకుంటారు. అలాగే వైశ్యులు.. మరో వర్గం.. మరో వర్గం ఎవరి ఆచారాలు.. సంప్రదాయాలు వారికి ఉంటాయి. ఎప్పుడైనా తప్పు అనుకున్నామా ? అసలు ఆ ఆలోచన వచ్చిందా ?. రాదు.. రాలేదు ఎందుకంటే మనకు ఉన్నట్లే వారి నమ్మకాలు వారికి ఉంటాయని మనకు అప్పుడు ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడేమయింది ?
హిజాబ్ ఇతరులకు ఎందుకు అభ్యంతరకరంగా మారింది !?
ప్రతి పౌరుడు తమ మతాన్ని ఆచరించే హక్కు రాజ్యాంగం కల్పించింది. హిజాబ్ లేదా బురఖా మతపరమైన ఆచారం. వారు వాటిని స్కూళ్లు, కాలేజీల్లో ధరించడంపైనే ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీరు తమ మతంలో కొత్తగా ఈ తీర్మానం చేశారని వారు ఆ పని చేయడం లేదు. అనాదిగా అంతే. నలభై ఏళ్ల క్రితం కూడా అలాగే వెళ్లేవారు. కానీ అప్పటికీ ఇప్పటికీ తేడా వచ్చింది ఆలోచనల్లోనే. వారు హిజాబ్ ధరించడాన్ని ఇప్పుడు ఇతర వర్గం భరించలేకపోతోంది. ముందుగా ఈ అభ్యంతరం స్కూళ్లు, కాలేజీల్లో వచ్చింది. కర్ణాటకలోని ఉడుపిలో ఓ స్కూల్ ప్రిన్సిపల్ వారిని హిజాబ్ ధరించి రావొద్దన్నారు. ఆయన అలా ఎందుకన్నారో ఆయనకే తెలియాలి. ఎందుకంటే వారు ఆ రోజే హిజాబ్‌తో మొదటి సారి రాలేదు. ఆ కాలేజీలో చదువుకునే ముస్లిం యువతులు ఏళ్ల తరబడి హిజాబ్‌తో వస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన మెదడు.. ఆలోచనలు.. పూర్తిగా అనాగరికంగా మారి ఉంటాయి. అందుకే ఇప్పుడు అడ్డుకున్నారు. అది దేశవ్యాప్త సంచలనం అయింది.
గత కొన్నేళ్ల నుంచి వివాదమే.. కోర్టుల్లోనూ తేల్చని ఫలితమే అలజడి !
ప్రతి ఒక్కరికి డ్రెస్ కోడ్ విషయంలో సొంత ఆలోచనలు, నమ్మకాలను అనుసరించే స్వేచ్ఛ ఉంది. అదే సమయంలో ఒక స్కూల్ లేదా కాలేజీ హక్కును క్లెయిమ్ చేసినప్పుడు.. ప్రాథమిక హక్కులను బ్యాలెన్స్ చేసి సమస్యను నిర్ణయించాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాల్లో గతంలో సుప్రీం కోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. రాజ్యాంగ హక్కు అనేది ఇతరుల హక్కులను నిర్మూలించడం ద్వారా ఒక హక్కును రక్షించడానికి ఉద్దేశించినది కాదు. కొన్నాళ్ల క్రితం కేరళలో ఇలాంటి వివాదమే తలెత్తింది. విషయం కోర్టుకు వెళ్లింది. హిజాబ్, ఫుల్ స్లీవ్ డ్రెస్‌లు ధరించి తరగతులకు హాజరయ్యేందుకు అనుమతించవచ్చా లేదా అనేది సంస్థ నిర్ణయించాల్సి ఉంటుందని హైకోర్టు తీర్పు చెప్పింది. నిర్ణయం తీసుకోవడం పూర్తిగా సంస్థ విషయమని చెప్పింది. ఇక్కడ ఉడుపిలో విద్యార్థులకు అలాంటి నిబంధనేది అడ్మిషన్ సమయంలో పెట్టలేదు. అక్కడే సమస్య ప్రారంభమయింది. ఇప్పుడు కూడా కర్ణాటక హైకోర్టు ఎటూ తేల్చలేకపోతోంది. పిటిషన్లను విచారణ చేసి తమ వల్ల కాదని విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేసింది. అప్పటి వరకూ విద్యా సంస్థల్లో మత పరమైన దుస్తులు వద్దని మధ్యంతర తీర్పు చెప్పింది. న్యాయస్థానం కూడా ఎటూ తేల్కలేకపోవడంతో ఈ వివాదం రావణకాష్టంలాగా పెరిగిపోతూ ఉండటమే తప్ప పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది.
సిక్కుల తలపాగాను విదేశాల్లో కూడా అంగీకరిస్తున్నారు కదా !
సిక్కులు తలపాగా ధరించడం, ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుంది. ప్రస్తుత పరిణామాల వల్ల ఓ వర్గంలో అశాంతి ఏర్పడటం సహజం. పాఠశాలలకు వెళ్లే పిల్లలను.. వారి మతాచారాలను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు పెరుగుతాయి. కర్ణాటకలో ప్రారంభమైన ఈ వివాదం దేశం మొత్తం విస్తరిస్తోంది. పుదుచ్చేరిలో .ఓ విద్యార్థిని ధరించిన హిజాబ్‌పై ఉపాధ్యాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ బాలిక మూడేళ్లుగా హిజాబ్ ధరించి తరగతులకు హాజరవుతుండగా.. కానీ ఇప్పుడే అభ్యంతరం వ్యక్తం చేశారు.మధ్యప్రదేశ్‌లో ఓ మంత్రి హిజాబ్‌ను వ్యతిరేకించారు. హిజాబ్ నిషేధానికి మధ్యప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ మద్దతునిచ్చారు. ఇది ఇంతటితో ఆగదు దావానలంలా మారుతూనే ఉంటుంది.
వందేళ్ల నాటకానికీ అదే దుస్థితి ఎందుకొచ్చింది ?
వందేళ్ల కిందటి ‘జనరంజక’ చింతామణి నాటకాన్ని ఆంధ్రపద్రేశ్ ప్రభుత్వం నిషేధించింది. ఆర్య వైశ్య సంఘం వాళ్లు ఈ నాటకం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నదని, నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వాళ్ల కోరిక మీదకు ప్రభుత్వం నిషేధించింది. కానీ నిషేధానికి కారణాలు చెప్పలేదు. లక్షల కాపీలు ఐదు తరాల పాఠకుల దగ్గరికి చేరాయి. వేలాది ప్రభుత్వ గ్రంథాలయాల్లో చోటు సంపాదించుకొని ఉంటాయి. సొంత గ్రంథాలయాల్లో భాగమై ఉంటాయి. నాటకంలోని సంభాషణలనో, సన్నివేశాలనో చట్ట వ్యతిరేకంగా చూపించి నిషేధం ప్రకటించాల్సి ఉంటుంది. మన ప్రభుత్వాలకు అంత ప్రజాస్వామిక దృష్టి కాదు కదా. కనీస ఇంగితం కూడా ఉండదు. అధికారం ఉంది కాబట్టి ఏ పని అయినా చేయవచ్చని అనుకుంటాయి. తాను నూరేళ్ల కిందటి నాటకాన్ని నిషేధిస్తున్నాననే స్పృహతో వ్యవహరించలేదు. తాను సాహిత్యంతో, కళతో వ్యవహరిస్తున్నాననే విజ్ఞతను ప్రదర్శించలేదు. ఆర్య వైశ్యులను సంతృప్తిపరిస్తే చాలని అనుకుంది. ఖచ్చితంగా ఇలాంటి భావాల వల్లే నాగరికం అనాగరికంగా మారుతోంది.
తాత ముత్తాతలకు చదువు లేదు కానీ ఇప్పటితో పోలిస్తే ఎంతో నాగరికులు !
స్వాతంత్రం వచ్చిన కొత్తలోనో .. రాక ముందో అక్షరాస్యత చాలా తక్కువ. కానీ ప్రతి ఒక్కరికి స్పష్టమైన అభిప్రాయాలుండేవి. అభ్యుదయ భావాలుండేవి. కానీ ఇప్పుడు కులం, మతం, ప్రాంతం, అధికారం,జాతీయవాదం ఇలా అభౌతిక అంశాలతో చూసుకుని ఒకరినొకరు కించ పర్చుకుంటున్నారు. మూఢ నమ్మకాలపై యుద్ధాలు ప్రకటించారు. అన్యాయాలకు ఎదురొడ్డి నిలబడ్డారు. సమాజం కోసం ప్రాణత్యాగాలకు సిద్ధపడ్డారు. కానీ ఇప్పుడు అక్షరాస్యత పెరిగింది.కానీ… అప్పట్లో ఉన్న అభ్యుదయ భావాలేమీలేవు. పైగా ఆలోచనలు కురచ అయిపోయాయి. పక్కవాడు వేసుకునే దుస్తుల్ని సహించలేకపోతున్నారు. పక్క వాళ్లు తినే తిండినీ సహించలేకపోతున్నాం. చివరికి పక్కవాడి కులం, మతం, ప్రాంతం అని ఆవేశకవేశాలకు లోనవుతున్నాం. ఏం జరిగినా అది మన కులం.. మన మతం.. మన ప్రాంతం అంటూ… విభజనకు గురవుతున్నాం.
ఇప్పుడు ఒక్క సారి మననం చేసుకోండి. గతంలో ఎలా ఉండేవాళ్లం? ఇప్పుడు ఎలా ఉంటున్నాం ? మన చిన్నప్పుడు ముస్లిం స్నేహితులు కలిస్తే వేరే ఆలోచనలు వచ్చేవా ? మన చిన్నప్పుడుఇతర ప్రాంతం వారు కలిస్తే ఏదైనా ద్వేషభావం కనిపించేదా ? మన చిన్నప్పుడు ఇతరులపై కుల, మత, ప్రాంతాల వారీగాఎవరిపైనైనా ద్వేషం పెంచుకున్నామా? లేనే లేదు. కానీ ఇవాళ అన్నీ మన మనసుల్లో చేరాయి. అందుకే.. అప్పట్లోనే అంటే మన తాతముత్తాతల కాలమే నాగరిక సమాజం..ఇప్పుడంతా అనాగరిక సమాజమే.