తెలుగు360 రేటింగ్: 2.5/5
చిన్న సినిమా అని ఇప్పుడెవ్వరూ చిన్న చూపుతో చూడటం లేదు. కొన్నిసార్లు పెద్ద సినిమాల్ని తలదన్నే స్థాయిలో వసూళ్లు సాధిస్తుంటాయి. తక్కువ వ్యయమే అయినా… ఎక్కువ లాభాల్ని సంపాదించి పెడుతుంటాయి నిర్మాతలకి. అందుకే పెద్ద నిర్మాణ సంస్థలు కూడా అప్పుడప్పుడూ చిన్న సినిమాలపై మక్కువ చూపెడుతుంటాయి. `జాతిరత్నాలు` తర్వాత ఓ చిన్న సినిమా విడుదలకి ముందే ఆ స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిందంటే `డీజే టిల్లు`నే. త్రివిక్రమ్ కొత్తగా ఏర్పాటు చేసిన ఫార్చూన్ ఫోర్ సంస్థతో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాలు మరింతగా దృష్టిపెట్టారు. అందుకు దీటుగానే ప్రచారం, వ్యాపారం జరిగింది. మరి సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం…
కథలోకి వెళితే.. హీరో పేరు డీజే టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ). కొంచెం సొల్లు ఎక్కువ చెప్పే టైప్. ఆ మాట స్వయానా తండ్రే చెబుతాడు. తండ్రి తనకి ఇష్టమైన స్వతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్ పేరు పెడితే, దాన్ని ట్రిమ్ చేసి తన ప్రొఫెషన్ని కూడా జోడించి డీజే టిల్లు అని తనకి తానే నామకరణం చేసుకుంటాడు. బన్నీతో సినిమా ఓకే అయ్యింది అంటూ పబ్‌లో సింగర్ రాధిక (నేహాశెట్టి)తో మాట కలుపుతాడు. ఆమెతో పీకల్లోతు ప్రేమలో పడతాడు. ఇంతలోనే రాధిక ఓ ట్విస్ట్ ఇస్తుంది. టిల్లుని ఇంటికి తీసుకెళ్లి తాను మర్డర్ చేశానని, ఆ విషయంలో సాయం చేయాలని అడుగుతుంది. అక్కడ్నుంచి మనోడు డీజే పాటలు మరిచి పాట్లు పడటం మొదలవుతుంది. మరి రాధికకి టిల్లు హెల్ప్ చేశాడా? ఇంతకీ రాధిక ఎందుకు హత్య చేసింది? వారిద్దరి కథ ఎక్కడిదాకా చేరిందన్నదే సినిమా.
గల్లీల్లో పండగలు, ఫంక్షన్లకి డీజే పెట్టే టిల్లు కథ ఇది. అంతే తప్ప తన డీజే ప్రొఫెషన్కీ, ఈ కథకీ మధ్య సంబంధమేమీ లేదు. టిల్లు లైఫ్ స్టైల్, అతని సందడితో సినిమా ఆసక్తికరంగానే మొదలవుతుంది. కథానాయకుడి తండ్రి తన కొడుకు గురించి చెప్పుకుని బాధపడే ఆరంభ సన్నివేశాలు నవ్వుల్ని పంచిపెడతాయి. కథానాయిక పరిచయమైన దగ్గర్నుంచి అసలు కథ మొదలవుతుంది. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయిన టిల్లు… హత్యని కప్పి పెట్టేందుకోసం పడే పాట్లన్నీ కూడా నవ్వుల్ని పంచుతాయి. ఇక గట్టెక్కాం అనుకునేలోపే మరో కొత్త పాత్రతో ఇక్కట్లు మొదలు కావడంతో సినిమా కథనం పరుగులు పెడుతుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకెత్తించడంతోపాటు, మరోపక్క టిల్లు ఫ్రస్ట్రేషన్ నవ్వుల్ని పంచుతుంది. అయితే అసలు కథలో బలం లేకపోవడంతో ద్వితీయార్థం సినిమా చతికిలపడుతుంది. ప్రథమార్థం స్థాయిలో ఫన్ కూడా జనరేట్ కాదు. దాంతో కథానాయకుడికి మెమరీ లాస్ అనీ, కోర్ట్ సీన్స్ అనీ… ఇలా చాలా హంగామానే నడిపారు కానీ, ఆ సన్నివేశాలేవీ ఎఫెక్టివ్‌గా అనిపించవు. కథ ప్లాట్ మరీ చిన్నది కావడం, కథానాయకుడి పాత్ర తప్ప మరే పాత్ర కూడా బలంగా లేకపోవడం సినిమాకి మైనస్ అయింది. న్యాయమూర్తి పాత్రలో ప్రగతి చెప్పే సంభాషణలు, ఆ నేపథ్యంలో సన్నివేశాలు మరీ సిల్లీగా అనిపిస్తాయి. మరో భాగం ఉందన్నట్టుగా కథని ముగించారు. ద్వితీయార్థానికి కథని పూర్తి చేసిన ఈ బృందం, మరో భాగం కథని ఎలా నడుపుతుందో చూడాలి మరీ!
టిల్లు పాత్రే సినిమాకి హైలెట్. ఆ పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ ఒదిగిపోయాడు. మల్కాజ్గిరి కుర్రాడిలానే తెలంగాణ యాసలో సంభాషణలు చెప్పాడు. అక్కడక్కడా ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ, ఇన్నోసెన్స్ ప్రదర్శిస్తూ పాత్రని రక్తికట్టించాడు సిద్ధు. కథానాయిక నేహాశెట్టి పర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రలేవీ ప్రభావం చూపించలేకపోయాయి. బ్రహ్మాజీ, నర్రా శ్రీను, ప్రగతి తదితర కామెడీ గ్యాంగ్ ఉన్నా ఆ పాత్రల రచనలో లోపాల వల్ల అవి పెద్దగా నవ్వించలేకపోయాయి. టెక్నికల్ టీమ్‌లో మ్యూజిక్ విభాగానికే ఎక్కువ మార్కులు పడతాయి. తమన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు కూడా బాగున్నాయి. డీజే టిల్లు పాట చిత్రణ మాస్‌ని మెప్పించేలా ఉంది. రెండు గంటలలోపే నిడిని. ఎడిటింగ్ విభాగం చక్కటి పనితీరుని కనబరిచినట్టు అనిపించినా సరే, అక్కడక్కడా సాగదీతగా అనిపిస్తాయి సన్నివేశాలు. సిద్ధు రాసిన మాటలు చిత్రానికి ప్రధానబలం. కాకపోతే ఆయన, తన తండ్రి పాత్రధారి విషయంలో మాత్రమే ఎక్కువగా దృష్టిపెట్టినట్టు అనిపిస్తుంది. విమల్‌కృష్ణ ప్రథమార్థం తర్వాత కథని నడిపించడంలో తడబడ్డారు. నిర్మాణం పరంగా సినిమా స్కేల్నిబట్టి ఖర్చు పెట్టారు.
యూత్‌ని ఆకట్టుకునే అంశాలు కాసిన్ని ఉండటానికి తోడు… ప్రథమార్థం రేసీ స్క్రీన్‌ప్లే వల్ల ప్రేక్షకులకు మంచి కాలక్షేపమే అవుతుంది. కానీ ద్వితీయార్థం టిల్లుని భరించడం కొంచెం కష్టమే. అయితే క్రిస్పీ సినిమా… ఈమధ్య కాలంలో కాసిన్ని సన్నివేశాల్లోనైనా బలంగా నవ్వించే సినిమా కావడం, ప్రి రిలీజ్ బజ్ సినిమాకి కలిసొచ్చే విషయాలు.
ఫినిషింగ్ టచ్: అట్లుంటది టిల్లుతోని
తెలుగు360 రేటింగ్: 2.5/5