తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనల్లో కలెక్టరేట్లు, పార్టీ ఆఫీసుల్ని ప్రారంభిస్తున్నారు. ఆ తర్వాత జరుగుతున్న సభల్లో ” ఖబడ్దార్.. మోడీ” అని గర్జిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని , చంద్రబాబును తిట్టినట్లుగా తిడుతున్నారు. కానీ జాతీయ స్థాయిలో ఎవరైనా పట్టించుకుంటున్నారో లేదో కానీ తాజాగా ఆయన మోడీపై కోపమే కాదు రాహుల్పై అభిమానం కూడా చూపిస్తున్నారు. భువనగిరి జిల్లాలో జరిగిన సభలో యధావిథిగా మోడీని చెడామడా తిట్టేసిన కేసీఆర్ అనూహ్యంగా రాహుల్కు మద్దతుగా నిలిచారు.
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ రాహుల్ గాంధీపై తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ తండ్రెవరో ఆధారాలు అడిగామా అంటూ ప్రశ్నించారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం అయింది. రాజకీయాలు ఇంతగా దిగజారిపోతున్నాయా అని పాత తరం నేతలు బాధపడ్డారు. ఈ అంశాన్ని కేసీఆర్ కూడా ప్రస్తావించారు. అసోం సీఎం మాటలు చాలా దారుణం అని.. అవి భారతీయ సంస్కృతిని విమర్శించడమేనన్నారు. ప్రధాని మోడీకి భారతీయ సంస్కృతిపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా తక్షణం బిశ్వశర్మను సీఎం పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ అవసరానికే స్పందిస్తారు. నిజానికి ఇలాగే ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వైసీపీ నేతలు అవమానించారు. సాక్షాత్తూ అసెంబ్లీలోనే అన్నారు. అప్పట్లో తెలంగాణ నుంచి కూడా చాలా మంది స్పందించారు. కానీ కేసీఆర్ మాత్రం స్పందించలేదు. కానీ ఎక్కడో అసోం సీఎం .. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడ్ని అంటే మాత్రం స్పందించారు. కేసీఆర్ మారుతున్న జాతీయ రాజకీయాల లెక్కల కోణం ఇందులో ఇమిడి ఉందేమో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.