హోదా వచ్చేసిందన్నతంగా వైసీపీ నేతలు హడావుడి చేశారు. సజ్జల నుంచి రోజా వరకూ అందరూ వీడియోలు రిలీజ్ చేశారు. ఇది ఒక అడుగే ఇక ముందు ముందు చాలా ఉందన్నారు. వైసీపీ నేతల హడావుడి చూసి నిజంగానే హోదా ఇచ్చేస్తున్నారేమో అని ఇతర పార్టీల వారు కూడా అనుకున్నారు. కానీ తీరా చూస్తే కాసేపటికే కేంద్ర హోంశాఖ కొత్త సర్క్యూలర్ విడుదల చేసింది.. ఈ సారి జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రత్యేకహోదా అంశం ఎక్కడా కనిపించలేదు. ఒక్క ప్రత్యేకహోదా మాత్రమే కాదు మరో మూడు అంశాలను కూడా చర్చల టాపిక్ నుంచి తప్పించారు.
ఉదయం తొమ్మిది అంశాలపై చర్చ ఉంటుందని చెప్పగా తాజాగా జారీ చేసిన సర్క్యూలర్‌లో కేవలం ఐదు అంశాలపై మాత్రమే చర్చ ఉంటుందని తెలిపింది. నిజానికి కేంద్ర హోంశాఖ ఉద్దేశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిక్కుముడిపడిపోయిన సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరపడమే. ఇందు కోసమే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తెలంగాణతో చర్చించాల్సిన అవసరం లేని.. కేంద్రమే పరిష్కరించాల్సిన ప్రత్యేకహోదా, అదనపు నిధులకు సంబంధించిన విజ్ఞప్తులు కూడా కనిపించడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు.
ఇలా ఎందుకు జరిగిందని ఆరా తీస్తే బీజేపీ నేతలకు చాలా కీలకమైన విషయాలు తెలిసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ప్రభుత్వ పెద్దలు తమ పలుకుబడి ఉపయోగించి కేంద్ర హోంశాఖలోని కొంత మంది సాయంతో ఆ టాపిక్స్ చేర్చినట్లుగా గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఇలా ఎవరు లాబీయింగ్ చేశారు.. ఎవరు ఆ టాపిక్స్ పెట్టించారు.. అధికారికంగా విడుదల చేయక ముందే వైసీపీ నేతలు ఆ పత్రాలను మీడియాకు ఎలాలీక్ చేశారన్నది అంతర్గత దర్యాప్తు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఓ రోజంతా హోదా అంశం హాట్ టాపిక్ అయింది.