” ఆయన ఆంబోతు.. ఆయన ఇంటి వైపు వెళ్లకండి పొడిచేస్తాడు ” అంటూ ఒకరు సోషల్ మీడియాలో పెడితే ఏ పనీ చేయకుండా ప్రజాధనాన్ని తీసుకుంటూ “గొడ్డుపోతుఆవులా” మేస్తున్నావ్ అంటూ మరొకరలు తిట్టి పోశారు. వీరిద్దరూ రెండు రాజకీయ పార్టీలకు అఫీలియేట్ అయిన కార్యకర్తలు కాదు. ఓ స్థాయి నేతలే. ఒకరు సీపీఐ నారాయణ.. మరొకరు జర్నలిస్టు సంఘాల ముసుగులో రాజకీయ పార్టీ పంచన చేరి సలహాదారు పదవి చేపట్టి రూ. లక్షల జీతభత్యాలు తీసుకుంటున్న దేవులపల్లి అమర్.
సీపీఐ నారాయణ ఎప్పుడు ఆయనను విమర్శించారో తెలియదు కానీ దేవులపల్లి అమర్ ఓ సోషల్ మీడియా పోస్టు పెట్టారు. నారాయణ పేరు ప్రస్తావించకుండా లాంకో హిల్స్ వైపు వెళ్లొద్దని చెబుతూ ఆయనపై నిందాపూర్వకమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి నారాయణ కామెంట్ల సెక్షన్లో సమాధానం ఇచ్చారు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. సీపీఐ నారాయణపై అమర్ దారుణమైన వ్యాఖ్యలు.. ఆరోపణలు చేశారు. దేవులపల్లి అమర్ వ్యవహారశైలిని నారాయణ తప్పు పట్టారు. వీరిద్దరూ ఇలా ఫేస్ బుక్ వేదికగా పోట్లాడుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
దేవులపల్లి అమర్ అనే తెలంగాణ పెద్దమనిషి తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రుల్ని తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టారు. అయినా ఏపీ ప్రజల సొమ్మును పనీపాటా లేకుండా నెలకు రూ. నాలుగైదు లక్షల వరకూ తీసుకుంటూ హైదరాబాద్ ఇంట్లో కాలక్షేపం చేస్తున్నారు. ఆ సొమ్ముకు న్యాయం చేయడానికన్నట్లుగా వైసీపీ పాలనపై విమర్శలు చేస్తున్న నారాయణ వంటి వారిని వ్యక్తిగతంగా తూలనాడేందుకు వెనుకాడటం లేదు. వైసీపీ మార్క్ అయిన సోషల్ మీడియాలో తన జర్నలిస్టు అనే ముసుగు.. ఇతర విలువలు.., గౌరవాలన్నింటినీ పోగొట్టుకునేందుకు కూడా సిద్ధపడి వ్యక్తిగత దూషణలకు దిగారు. చివరికి నారాయణ ఘాటుగా బదులివ్వడంతో ఇప్పుడు ఆయన వ్యవహారశైలిపైనా చర్చ జరుగుతోంది.