తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రధాని మోడీని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. అదే సమయంలో మోడీని తన జోలికి రావొద్దని ఆయన హెచ్చరికలు అందులో ఎక్కువగా ఉంటున్నాయి. జనగామలో మాట్లాడుతూ ” మీ జాగ్రత్తలో మీరు ఉండండి.. మా జాగ్రత్తలో మేముంటామని ” ఓ సందర్భంలో సందేశం పంపారు. భువనగిరిలో మీ అవినీతి చిట్టా నా దగ్గర ఉందని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏ ఉద్దేశంతో అలా అన్నారో కానీ కేసీఆర్ విచారణ భయంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
బీజేపీ నేతలు కొద్ది కాలంగా కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే అవన్నీ రాజకీయంగా చేస్తున్న విమర్శలే అనుకున్నారు జూన్లో రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయిన తర్వాత బీజేపీ తెలంగాణలో కేసీఆర్ ను టార్గెట్ చేసుకుంటుందని అప్పటికి కేసీఆర్పై గరిష్టంగా ప్రజా వ్యతిరేకత ఉంటుందని కేసులు పెట్టినా కేసీఆర్కు సానుభూతి దక్కదన్న అభిప్రాయం బీజేపీలో ఉందనిఅంటున్నారు. ఈ విషయంపై కేసీఆర్కు స్పష్టమైన సమాచారం ఉండటంతోనే ఎదురుదాడికి దిగుతున్నారని తన జోలికి రావొద్దని హెచ్చరిస్తున్నారని భావిస్తున్నారు.
కేసీఆర్ వివిధ పథకాలు మేఘా వంటి సంస్థలతో ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేంద్రం తల్చకుంటే ఎలాంటి లొసుగులైనా కనిపెట్టగలదని కేసీఆర్కు తెలియకుండా ఉండదని అంటున్నారు. అదే సమయంలో కేసీఆర్ బీజేపీ వ్యతిరేక పక్షాలకు ఆర్థిక సాయం చేశారన్న ప్రచారం కూడా ఉంది. అన్ని వివరాలతో బీజేపీ విరుచుకుపడే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఎదురుతిరిగడం తప్ప మరో మార్గంలేక కేసీఆర్ చివరి ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం బీజేపీ నేతల్లో వినిపిస్తోంది.