ఏపీ బీజేపీలోని ప్రో వైసీపీ గ్రూప్‌కు లీడర్ లాంటి నేత సోము వీర్రాజు అనే ఓ నమ్మకం ఏపీ రాజకీయాల్లో ఉంది. దీనికి కారణం అయన వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఘాటుగా విమర్శించారు. విమర్శించాలంటే ముందుగా టీడీపీని విమర్శించి.. గతంలో అలా చేశారు… ఇలా చేశారు అని విశ్లేషించి ఆ తర్వాత జగన్ కూడా అదే దారిలో వెళ్తున్నారు అని జస్టిఫికేషన్ ఇచ్చే వారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మార్పు వస్తోంది. గత ప్రభుత్వం బాగా చేసింది.. ఈ ప్రభుత్వం వాటిని కూడా చెడగొడుతున్నారని విమర్శించే పరిస్థితికి వచ్చారు.
కేంద్ర మంత్రి గడ్కరీ పదిహేడో తేదీన ఏపీ పర్యటనకు వస్తున్న సందర్భంగా ప్రెస్‌మీట్ పెట్టిన సోము వీర్రాజు.. కేంద్రం చేపట్టిన అభివృద్ధి పథకాలను వల్లే వేశారు. రూ. 21,500,58కోట్ల రూపాయలతో ప్రాజెక్టులకు గడ్కరీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారని ప్రకటించారు. ఏపీకి రూ. 64వేల కొట్ల రూపాయలు ప్రాజెక్టు లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని పార్లమెంటు సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు.ఇందులో అధిక ప్రాజెక్టు లను ఎపి ప్రభుత్వం అడిగి తీసుకోవాల్సి ఉందనీ కానీ గత ప్రభుత్వం సాధించుకొచ్చిన వాటిని కూడా వెనక్కి పంపుతున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు.
నేచర్ క్యూర్ హాస్పటల్ హైదరాబాద్ లో ఉంది. 25ఎకరాలను కేటాయించి ఎపిలో నిర్మాణం చేపట్టాలని టీడీపీ ప్రభుత్వం కోరింది. గన్నవరం మండలంలో ఈ ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపింది. అలాగే సామర్లకోటలో సెంట్రల్ ప్లాంటేషన్ కార్పొరేషన్ నిర్మాణానికి గతంలో అడిగారు. స్థలం కూడా కేటాయించారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ రెండు ప్రాజెక్టు లకు ఇచ్చిన స్థలాలను వెనక్కి తీసుకున్నారు..ఆస్థలాల్లో జగనన్న ఇళ్లకు కేటాయించారని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఆమోదం తెలిపాక ఇచ్చిన స్థలాలని వెనక్కి తీసుకుంటారా అని ప్రశ్నించారు.
కేంద్రం ప్రాజెక్టు లు పెడతానన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకునేందుక ుఎపి ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు. 17వ తేదీన సమావేశం లో ఎపి, తెలంగాణ ఆస్తుల అంశం పై చర్చ జరుగుతుందని ప్రత్యేకహోదాకు సంబంధం లేదన్నారు.హోదా పై ప్రత్యేక సమావేశం పెట్టి చర్చించాలన్నారు. గత ప్రభుత్వం కొన్ని అంశాలలో పెట్టుబడులు తీసుకున్నారని… కేంద్రం ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఎందుకు జగన్ పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.