ప్రత్యేకహోదా ఆంశం ఏపీలో మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర హోంశాఖ ఏ ఉద్దేశంతో చర్చల టాపిక్‌లో ప్రత్యేకహోదాను చేర్చారో కానీ ఆ విషయం సంచలనాత్మకం అయింది. ఇప్పుడు తొలగించడం అంత కన్నా ఎక్కువ వివాదాస్పదం అవుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఏదో కుట్ర ఉందని స్పష్టంగా తెలుస్తోంది. దీనిపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టిందో లేదో స్పష్టతలేదు కానీ ఏపీ అధికార పార్టీపై మాత్రం కొత్తగా ఒత్తిడి ప్రారంభమయింది. ఎజెండాలో ప్రత్యేకహోదా పెట్టిన వెంటనే పెద్ద ఎత్తున వైసీపీ నేతలు తెరపైకి వచ్చి జగన్ హోదా సాధించేశారన్నట్లుగా ప్రచారం చేశారు.
అయితే రెండు గంటల్లోనే ఆ విషయాన్ని తొలగించడంతో ఇప్పుడు వైసీపీ నేతలు ఏం చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైతే మీడియా ముందుకు వస్తుందన్న వైసీపీ నేతలు బీజేపీ, టీడీపీ నేతలు కుమ్మక్కయ్యారని .. హోదా అంశాన్ని తొలగింప చేశారని ఆరోపిస్తున్నారు. నిజంగా కేంద్ర హోంశాఖ పరిష్కరించాలనుకున్న వాటిని తొలగించేంత అంత పలుకుబడి తమకు ఉంటే ముందుగా జగన్ అక్రమాస్తుల కేసుల్లో … ఈడీ కేసుల్లో విచారణ వేగవంతం అయ్యేలా చూస్తామని టీడీపీ నేతలు బహిరంగంగానే సెటైర్లు వేస్తున్నారు. ఈ రాజకీయ ఆరోపణలు సంగతి తర్వాత ముందు హోదా సాధనకు ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రత్యేకహోదాను అజెండాలో పెట్టకపోతే తాము చర్చలకు రాబోమని కేంద్రానికి సమాచారం పంపాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంపై యుద్ధం ప్రకటించాని టీడీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. గతంలో చెప్పినట్లుగా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోదాయోధునిగా ప్రకటించుకున్న జగన్ ఇప్పుడు ముందడుగు వేయాలని.. కేంద్రంతో ఫైట్ చేయాలని అంటున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు.
కేంద్రంతో హోదా కోసం పోరాటం చేసే పరిస్థితి లేదు. అందుకే టీడీపీ.. టీడీపీకి లింక్ పెట్టి బీజేపీ నేతలను విమర్శిస్తే సరిపోతుందని క్లారిటీకి వచ్చారు. మోడీ జోలికి పోకూడదని ఓ అప్రకటిత నిబంధన పెట్టుకున్నారు. ఈ ప్రకారం ఏపీ హోదా విషయంలోనూ రాజకీయమే జరుగుతుంది. కానీ కేంద్రంపై పోరాటం అనే ప్రశ్నే ఉండదని అంటున్నారు.