తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ, మోడీపై యుద్ధం ప్రకటించారు. అయితే ఆప్తమిత్రుడు జగన్‌ను మాత్రం ఎక్కడా లాగడం లేదు. వీలైనంత సంయమనం పాటిస్తున్నారు. ఆయన వస్తారని చెప్పడం లేదు. కానీ కేసీఆర్ తన రాజకీయ పోరాటానికి ఎంచుకున్న టాపిక్ మాత్రం జగన్‌కు ఇబ్బందికరమే. కేసీఆర్ వ్యవసాయ బోర్లకు కరెంట్ మీటర్లు పెట్టడాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తూ రైతుల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన సాక్ష్యంగా ఏపీలో రైతుల బోర్లకు పెడుతున్న మీటర్లనే చూపిస్తున్నారు. ఇలా మీటర్లు పెడితే రైతుల పరిస్థితి ఆగమైపోతుందని .. తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే బాగు పడుతున్నాని తాను ప్రాణం పోయినా మీటర్ల పెట్టబోనని చెబుతున్నారు.
కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రైతుల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. మీటర్లు పెడితే తమ బతుకు ఆగం అయిపోతుందా అని వారు ఆందోళన చెందుతున్నారు. రైతులకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏపీ ప్రభుత్వం మీటర్లు పెడుతోంది. కేంద్రం వద్ద కేసీఆర్ చెప్పినట్లుగా 0.5 శాతం అధిక ఎఫ్ఆర్బీఎం రుణాల కోసం సంస్కరణలకు ఒప్పుకుంది. మీటర్లు పెట్టడం ప్రారంభించి అప్పులు కూడా తెచ్చుకుంది. శ్రీకాకుళంలో పాతిక వేల మీటర్లు పెట్టారని కేసీఆర్ చెప్పారు కానీ… పలు జిల్లాల్లో ఇప్పటికే మీటర్లు పెడుతున్నారు. ఇది ైతుల్లో ఆందోళనకు కారణం అవుతోంది. ఇప్పుడు కేసీఆర్ మాటలు మరింతగా రైతుల మనసుల్లోకి వెళ్తున్నాయి.
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు.. నిరంతరాయంగా తొమ్మిది గంటల విద్యుత్ అందించేందుకు మాత్రమే మీటర్లు పెడుతున్నామని వైసీపీ చెబుతోంది. ఎంత కరెంట్ వాడుకున్నా ఆ మొత్తం రైతు అకౌంట్లో జమ చేస్తామని .. రైతుల బిల్లులు కట్టుకుంటే చాలని అంటున్నారు. కానీ ప్రభుత్వం కరెక్ట్‌గా ఇస్తుందన్న నమ్మకం ఇప్పటికీ రైతులకు లేదు. దీంతో ఈ మీటర్ల తంటా ఎందుకు కేసీఆర్ చెప్పినట్లుగా .. మీటర్లు పెట్టబోమని జగన్ చెప్పవచ్చు కదా అన్న భావన రైతుల్లో ఏర్పడుతోంది. తెలంగాణలో కేసీఆర్ కరెంట్ మీటర్ల ఉద్యమాన్ని పీక్స్‌కు తీసుకెళ్లే కొద్దీ ఏపీలో ఇది మరింత ఊపందుకుంటుంది. ఇది వైసీపీని ఆందోళన పరిచే అంశమే.