వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి చిక్కులు తప్పేలా లేవు. ఆయన ప్రధాన అనుచరుడు శంకర్ రెడ్డి ఇప్పటికే జైల్లో ఉన్నారు. ఆయనకు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఇప్పుడు మరో ముఖ్య అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిపై సీబీఐ అధికారులు దృష్టి సారించారు. కొంత కాలం గ్యాప్ ఇచ్చిన సీబీఐ అధికారులు మళ్లీ పులివెందులకు వచ్చి విచారణ ప్రారంభించారు. పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో యుసిఐల్ ఉద్యోగి ఉదయ్ కూమార్ రెడ్డిని పిలిపించ ప్రశ్నిస్తున్నారు.
ఉదయ్ కుమార్ రెడ్డిని గత ఏడాది సెప్టెంబర్‌లోనే అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకుని వదిలి పెట్టారు. ఆ తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి విషయంలో ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు దస్తగిరి అప్రూవర్‌గా మారిన తర్వాత రెండు చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత మరోసారి ఉదయ్ కుమార్ రెడ్డిని పిలిపించి ప్రశ్నించడం సంచలనంగా మారింది. విచారణ తర్వాత ఆయనను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత సీబీఐ అధికారులపై ఒత్తిడి పెరిగింది. సీబీఐ అధికారులపై రివర్స్ ఆరోపణలు చేస్తూ కొంత మంది తెరపైకి వచ్చారు. అప్పట్లో విచారణ ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు. సీబీఐ అధికారులు ఎలాంటి ఒత్తిడి లేకుండా విచారణ జరపాలనిక భరోసా ఇచ్చి ఢిల్లీ ఉన్నతాధికారులు పంపించినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ముందు ముందు మరిన్ని సంచలనాలు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది.