రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తే చూడాలన్నది టాలీవుడ్ కోరిక. ఎప్పటి నుంచో ఈ కాంబో నలుగుతూనే ఉంది. ఎట్టకేలకు ఫిక్సయ్యింది. ఆర్.ఆర్.ఆర్ తరవాత రాజమౌళి మహేష్‌తోనే సినిమా చేయబోతున్నారు. త్రివిక్రమ్ తో సినిమా అయ్యాక..రాజమౌళితో చేతులు కలపబోతున్నాడు మహేష్.
ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. మహేష్ – రాజమౌళిల సినిమా ఓ మల్టీస్టారర్. ఇందులో మరో అగ్ర హీరోకూడా నటించబోతున్నాడు. ఈ సినిమాలో 40 నిమిషాల వ్యవధిగల ఓ కీలకమైన ఎపిసోడ్ ఉంది. ఆ ఎపిసోడ్ కోసం ఓ పెద్ద హీరో కావాలి. రాజమౌళిది పాన్ ఇండియా విజన్. తను కోరుకుంటే బాలీవుడ్ నుంచి సైతం.. హీరోల్ని దిగుమతి చేసి, వాళ్లతో సినిమాలు చేయగలడు. కానీ మహేష్‌తో సినిమా కోసం ఓ టాలీవుడ్ స్టార్‌నే ఎంచుకోవాలని చూస్తున్నాడట. `ఆర్.ఆర్.ఆర్`లో ఇద్దరూ తెలుగు హీరోలే. కానీ పాన్ ఇండియా స్థాయి మార్కెట్ జరిగింది. ఈసారి కూడా అదే ఫార్ములాని వర్కవుట్ చేయాలన్నది రాజమౌళి ఆలోచన. అయితే ట్విస్ట్ ఏమిటంటే.. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నా, వారిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో ఉండరట. ఇద్దరూ కలిసి నటించే సందర్భం లేదని తెలుస్తోంది. కథ అందుకు డిమాండ్ చేయడం లేదట. కానీ 40 నిమిషాల పాటు సాగే ఆ ఎపిసోడ్ మాత్రం అదిరిపోయే స్థాయిలో డిజైన్ చేయబోతున్నార్ట. అందుకే ఓ స్టార్ హీరోని ఎంచుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు రాజమౌళి.