చీఫ్ సెక్రటరీనే బదిలీ చేసేంత అధికారం ఏపీ ప్రభుత్వంలో అనుభవించిన సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్‌ను సీఎం జగన్ ఢిల్లీ పంపేశారు. కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లడానికి ప్రవీణ్ ప్రకాష్ ప్రయత్నం చేస్తున్నా చాన్స్ రాకపోవడంతో … సీఎంజగన్ ఆయనను ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా బదిలీ చేశారు. సీఎంవోలోకి రాక ముందు ప్రవీణ్ ప్రకాష్ ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గానే ఉండేవారు. జగన్ సీఎం బాధ్యతలు చేపట్టిన మొదట్లో ఢిల్లీలో జరిగిన ఓ టీటీడీ కార్యక్రమంలో నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై విచారణ కూడా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆయన ఏపీ సీఎంవోలోకి వచ్చి కీలకంగా ఎదిగారు.
ప్రవీణ్ ప్రకాష్ వ్యవహారశైలి అత్యంత వివాదాస్పదంగా ఉంటుంది. మోనార్క్ స్టైల్. సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేస్తూ ప్రవీణ్ ప్రకాషే ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ అనేక వివాదాస్పద నిర్ణయాల వెనుక ఆయన పాత్ర ఉందని అధికారవర్గాల్లో ప్రచారం ఉంది. ఆయన తీరు మరీ శృతి మించిందో లేకపోతే దూరం పెట్టాలనుకున్నారో కానీ ఏడాది జూలైలో జీఏడీ పొలిటికల్ బాధ్యతల నుంచి ఆయన్ని జగన్ తప్పించారు. సీఎం ముఖ్య కార్యదర్శిగా మాత్రం కొనసాగుతున్నారు. తాజాగా పూర్తిగా ఢిల్లీకి పంపేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
జగన్ నమ్మిన అధికారిగా ప్రవీణ్ ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర సంబంధాలను చూస్తున్నట్లుగా తెలుస్తోంది. విభజన చట్టంలోని అంశాలను కేంద్రంతో చర్చించే బాధ్యతను ప్రవీణ్ ప్రకాషే చూస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇటీవల రిపబ్లిక్ డే రోజు మోకాళ్లపై కూర్చొని ప్రవీణ్ ప్రకాష్ సీఎం జగన్‌కు ఏదో చెబుతూండటం మీడియాలో హైలెట్ అయింది. అయితే ఇంత హఠాత్తుగా ఎందుకు ప్రవీణ్ ప్రకాష్‌ను బదిలీ చేశారన్నదానిపై స్పష్టత లేదు. ఈ విషయంలో అంతర్గతంగా ఏదో జరుగుతోందని ప్రవీణ్ ప్రకాష్ పై చర్యల రూపంలోనే ఈ బదిలీ ఉందని భావిస్తున్నారు. చివరికి ఏదయితేనేం జగన్ సీఎం అయినప్పుడు ఏ పోస్టింగ్‌లో ఉన్నారో మళ్లీ అదే పోస్టింగ్‌కు చేరుకున్నారు.