కొత్త జిల్లాల విషయంలో కేంద్రంతో వివాదానికి దిగేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. కొత్త జిల్లా ఏర్పాటుపై ఇప్పటికే సీలింగ్ ఉంది. జనాభా లెక్కల కారణంగా ఎలాంటి జిల్లాల సరిహద్దులను మార్చవద్దని కేంద్రం ఎప్పుడో ఆదేశించింది. కరోనా వల్ల లెక్కలు ఆలస్యమవుతున్నాయి. అయినప్పటికీ జిల్లాల సరిహద్దులు మార్చే విషయంలో సీలింగ్ కొనసాగుతోంది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం హుటాహుటిన సరిహద్దుల్ని మార్చేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించింది. జిల్లాలు ఏర్పాటయ్యాక కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది.
కొత్త జిల్లాల ఏర్పాటుపై కేంద్రం అనుమతి అవసరం లేదన్నది రాష్ట్ర ప్రభుత్వం భావనగా ఉన్నతాధికారులు చెబుతున్నారు. జిల్లాలను ఏర్పాటు చేసి కేంద్రానికి పంపిస్తే నోటిఫై చేస్తుందని అంటున్నారు. మామూలుగా అయితే ఇలా చేస్తుందేమో కానీ ప్రస్తుతం సెన్సెస్ కోసం సరిహద్దులు మార్చవద్దని ఇచ్చిన ఆదేశాలు అమల్లో ఉండగా ఏపీ ప్రభుత్వం ఇచ్చే సమాచారాన్ని ఎలా నోటిఫై చేస్తుందన్నది పెద్ద పజిల్‌గా మారింది. ఇప్పటి దాకా సీఎం జగన్ కేంద్రం వద్ద ప్రత్యేక అనుమతి తీసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతూ వస్తోంది. కానీ అలాంటిదేమీ లేదని జిల్లాల కసరత్తు ముందుకు సాగే కొద్దీ తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందా అని ఉన్నతాధికార వర్గాల్లోనూ టెన్షన్ ప్రారంభమయింది. మార్చి మూడో వారంలో కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది.
ఉగాది నుండి కొత్త జిల్లాల నుండి పాలన సాగించాలని భావిస్తున్నారు. దీంతో పాటు జిల్లాల్లో ఉద్యోగుల విభజన, ప్రమోషన్లు, సర్వీస్ ఇబ్బందులపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. అయితే ఎన్ని చేసినా ప్రభుత్వం నోటిఫై చేయకపోతే లేనిపోని గందరగోళానికి కారణం అవుతుంది. ఈ విషయం తెలిసి కూడా ఏపీ ప్రభుత్వం ఎందుకంత హడావుడి చేస్తుందో అధికారులకుఅర్థంకావడం లేదు. ఒక వేళ కేంద్రం అడ్డుపుల్ల వేస్తే చేయాలనుకున్నాం..కానీ కేంద్రం అడ్డుకుందని చేసే రాజకీయ ఎత్తుగడ ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.