ఎవరితో అయినా ప్రమాదకరం అయితే హెచ్చరికగా బీవేర్ ఆఫ్ అంటూ బోర్డులు పెడుతూంటాం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అలాంటి బోర్డే తగిలించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకులు ఏపీ ప్రభుత్వానికి రుణాలు ఇచ్చే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలని కేంద్రం ప్రత్యేకంగా ఆదేశాలిచ్చింది. కేంద్రం నేరుగా రుణాలివ్వొద్దని చెప్పదు. కానీ ఇలా రుణాలివ్వాలంటే ఆలోచించండి అని చెప్పిందంటే పరోక్షంగా ఇవ్వొద్దని అర్థం. అందుకే బ్యాంకులు ఎందుకు వచ్చిన రిస్క్ అని రుణాలు అన్నీ ఆపేశాయి. అంగీకరించి సగం ఇచ్చిన రుణాలను తర్వాత కూడా ఇవ్వకుండా మానేశాయి.
ఏపీకి రుణాలివ్వొద్దని పరోక్షంగా బ్యాంకులకు కేంద్రం ఆదేశాలు !
ఏపీ ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో కొన్ని వేల కోట్ల రుణాలు తీసుకుంటోంది. ఎపీఎస్డీసీ సహా అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఎఫ్ఆర్బీఎం చట్టం పరిధిలోకి అవి రావంటూ ప్రభుత్వ ఆస్తులను నిర్మోహమాటంగా బ్యాంకులకు రిజిస్ట్రేషన్ చేస్తూ తనఖా పెట్టేసి వందల కోట్లు అప్పు తీసుకుంటున్నారు. వీటిపై ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి. కోర్టుల్లో కేసులు పడ్డాయి. అయినా బ్యాంకులు మాత్రం రుణాలు ఇస్తూనే ఉన్నాయి. చివరికి కేంద్ర ప్రభుత్వానికి వెళ్లిన ఫిర్యాదుల మేరకు అన్నీ పరిశీలించిన కేంద్రం బ్యాంకులకు హెచ్చరికలు జారీ చేసింది.
జగన్ ఢిల్లీ వెళ్లి చేసిన పని ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకోమనే !
ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన పర్యటన ఎజెండా ఎమిటో తెలియదు కానీ ప్రో వైసీపీ మీడియాలో వచ్చే వాటిని బట్టి ఆయన ఎప్పుడూ అడిగేవన్నీ అడిగారని చెప్పారు. కానీ నిజానికి జగన్ ప్రధానితో పాటు ఆ రోజు సాయంత్రమే నిర్మలను కలిసి అడిగింది కేంద్రం బ్యాంకులకు ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోమని కోరడానికే. కేంద్రం అలాంటి ఉత్తర్వులు ఇవ్వడం వల్ల బ్యాంకులు డబ్బులివ్వడం లేదని జగన్ మోడీకి చెప్పుకున్నారు. ఇప్పుడీ విషయం వెలుగులోకి వచ్చింది.,
అందుకే ప్రైవేటు బ్యాంకుల్లో తాజాగా తాకట్ల పర్వం !
ప్రభుత్వ బ్యాంకులు అప్పులివ్వడం లేదని ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రైవేటు బ్యాంకుల్ని సంప్రదిస్తోంది. విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉన్న బెరంపార్క్ను రూ. 143 కోట్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు తాకట్టు పెట్టేశారు. ఇప్పుడు మరికొన్ని ఆస్తులను తాకట్టు పెట్టేందుకు ఇతర ప్రైవేటు బ్యాంకులను సంప్రదిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏదైమైనా అప్పు లేకపోతే ఒక్క నెల కూడా ఏపీ ప్రభుత్వానికి గడవదని తేలిపోయింది.