ఆంధ్రప్రదేశ్లో గత నవంబర్లో వచ్చిన ఆకస్మిక వరదలకు సర్వం కోల్పోయిన రైతులు కొన్ని వేల మంది ఉన్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సృష్టించిన బీభత్సం ధాటికి పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. అప్పట్లో ప్రభుత్వం రైతులకు ఎలాంటి సాయం చేయకపోవడపై విమర్శలు వచ్చాయి., అయితే ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ పేరుతో ప్రభుత్వం నష్టపరిహారం పంపిణీ చేస్తోంది. 5,71,478 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతుల ఖాతాల్లో రూ.534.77 కోట్లు జమ చేయనున్నారు., అంటే సగటున ఒక్కో రైతుకు రూ. తొమ్మిది వేల మూడు వందల వరకూ లభించే అవకాశం ఉంది.
గత నవంబర్లో వచ్చినవి అసాధారణ వరదలు., డ్యాంలు, బ్రిడ్జిలే కొట్టుకుపోయాయి. ఇక పంటలు ఎంత.? ఎకరాకు కనీసం రూ. ఇరవై వేలు ఇవ్వాలని ..ఇసుక మేట వేసిన భూముల్ని మళ్లీ పంటకు అనుకూలంగా చేసి ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ త్వరగా ఇస్తామని చెప్పింది. ఇప్పుడు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని నిర్ణయించింది. సీఎం జగన్ ఆ మొత్తాన్ని ఇవాళ రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
1220 రైతు గ్రూపులకు వైఎస్ఆర్ యంత్రసేవా పథకం కింద 29.51 కోట్లను కూడా జగన్ రైతు ఖాతాల్లో జమ చేస్తారు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 19.93 లక్షల మంది రైతులకు రూ.1,612 కోట్ల సాయం అందించినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఏ సీజన్ లో జరిగిన నష్టానికి అదే సీజన్ లో నష్టపరిహారం చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని … ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు పరిహారం అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.