“గౌతం సవాంగవం అన్న”ను జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించారు. డీజీపీ పోస్టు నుంచి బదిలీ చేశారు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. కొత్త డీజీపీ ఎవరో ఖరారు కాకుండానే … చేయకుండానే గౌతం సవాంగ్‌ను బదిలీ చేయడం అనూహ్య పరిణామంగా మారింది. గౌతం సవాంగ్ పనితీరు పట్ల ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూంటాయి. పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు తెచ్చారని అంటూ ఉంటారు. అదే అభిప్రాయంతో సీఎం జగన్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే హఠాత్తుగా బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల గౌతం సవాంగ్‌కు దేశంలో ఉత్తమ డీజీపీ అవార్డు వచ్చింది. స్కోచ్ లాంటి సంస్థలు ఇంటికే వచ్చి అవార్డులు ఇచ్చాయి.
అయినప్పటికీ సవాంగ్ పనితీరుపై సీఎం జగన్‌కు సంతృప్తి కలగలేదని తాజా బదిలీతో స్పష్టయిమయింది. ఉద్యోగుల ఉద్యమం సందర్భంగా కట్టడి చేయలేకపోవడం మాత్రమే కాకుండా మొదటి నుంచి చాలా విషయాల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు రావడానికి పోలీసుల తీరే కారణమయిందన్న అభిప్రాయంతో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయంటున్నారు. చాలా రోజులుగా డీజీపీతో జగన్ ముభావంగా ఉంటున్నారు. అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని.. అసలు కలవడం లేదని తెలుస్తోంది. డీజీపీకి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌తో విభేదాలు ఉన్నాయి. అవి గతంలో కొన్ని సందర్భాల్లో బయటపడ్డాయి. అప్పుడే ఆయనను బదిలీ చేస్తారన్న ప్రచారం జరిగింది.
కానీ అప్పట్లో పరిస్థితులు సద్దుమణిగాయి. ఇప్పుడు ఆయనను బదిలీ చేస్తారు. కొత్త డీజీపీగా ఎవరిని నియమిస్తారన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. హఠాత్తుగా తొలగించారు కాబట్టి పూర్తి అదనపు బాధ్యతల్ని ఇంటలిజెన్స్ చీఫ్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి ఇచ్చారు. తర్వాత పూర్తి బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.