వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఓ వైపు సీబీఐ దూకుడు పెంచడం… అవినాష్ రెడ్డిని ప్రధాన నిందితునిగా అనుమానిస్తున్నట్లుగా కోర్టుకు సీబీఐ చెప్పడంతో తాజాగా ఉదయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి తెరపైకి వచ్చారు . సీబీఐపై ఆరోపణలు చేస్తూ కడప ఎస్పీని కలిశారు. సీబీఐ తాను చెప్పేది పట్టించుకోవడం లేదని వారు చెప్పేదే పాటించాలంటున్నారని ఉదయ్ కుమార్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఉదయ్ కుమార్ రెడ్డి యూసీఐఎల్ ఉద్యోగి. ఆయన అవినాష్ రెడ్డికి సన్నిహితుడు. ఆయనను గతంలో ఓ సారి… సోమవారం మరోసారి సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
గతంలో సీబీఐపై గంగాధర్ రెడ్డితో పాటు వివేకా పీఏ కృష్ణారెడ్డి కూడా ఫిర్యాదు చేసి ఉన్నారు. సీబీఐపై ఫిర్యాదు చేయడం ఇది మూడో వ్యక్తి. అయితే ఆ రెండు డీజీపీగా సవాంగ్‌ను బదిలీ చేయడానికి ముందుచోటు చేసుకున్నాయి. ఇప్పుడు సవాంగ్‌ను బదిలీ చేసి .. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని పోస్టులోకి తీసుకున్నాక చేసిన ఫిర్యాదు. దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. మరో వైపు కడప జైలర్‌గా నియమితులైన వివాదాస్పద అధికారి వరుణా రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది.
ఆయనను ఒంగోలు జైలుకు మార్చింది. వరుణారెడ్డి పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మొద్దు శీను జైల్లో హత్య చేసిన సమయంలో అనంతపురం జైల్లో విధుల్లో ఉన్నారు. దీంతో వివేకా హత్య కేసు నిందితుల్ని కూడా హతమార్చడానికి వరుణారెడ్డిని అక్కడ పోస్టింగ్ ఇచ్చారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. ఈ క్రమంలో ఆయనను కడప నుంచి బదిలీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్ వివేకా హత్య కేసులో ముందు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.