ఉద్యోగుల జీతాలు రికవరీ చేయవద్దని హైకోర్టు ఆదేశిస్తే.. రికవరీ ఎక్కడ చేస్తున్నాం.. చేస్తోంది సర్దుబాటే అని సలహాదారుడు చెప్పిన తెలివి తేటలు అన్నీ అంశాల్లోనూ ప్రయోగిస్తున్నారు. మూడు రాజధానులు అంటే కోర్టుల్లో నిలవట్లేదని ఒకే రాజధాని.. రెండు ఉపరాజధానులు అంటూ కొత్త బిల్లు తయారు చేసేస్తున్నట్లుగా తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో పెట్టబోయే బిల్లులో ఒక రాజధానితో పాటు రెండు ఉపరాజధానులను ప్రతిపాదించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
అమరావతిని రాష్ట్ర రాజధాని విశాఖపట్నం, కర్నూలును ఉపరాజధానులుగా బిల్లు తయారు చేసి ఆమోదం పొందనున్నారు. ఇలా చేస్తే న్యాయపరమైన చిక్కులు ఏమేమి వస్తాయో ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. పరిపాలనా సౌలభ్యం రీత్యా ఉపరాజధానుల్లో అనుబంధ అనుబంధ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటామని బిల్లులో చెప్పే అవకాశం ఉంది. మూడు రాజధానులు అంటే సీఆర్డీఏ చట్టం.. రైతులతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం చెల్లుబాటయ్యే అవకాశం లేదు. అందుకే ఉపరాజధానుల ప్రస్తావన.
కర్నూలులో హైకోర్టు పెడతామన్నది కూడా బిల్లులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. హైకోర్టు కర్నూలుకు మార్పు అనేది ప్రభుత్వం చేతుల్లో లేని పని. కేంద్ర న్యాయశాఖ నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కర్నూలు ఉపరాజధానిలో హైకోర్టును పెట్టే అవకాశం కనిపించడం లేదు. మొత్తంగా చూస్తే మూడు రాజధానులను మరో రూపంలో అసెంబ్లీ ముందుకు తీసుకు రాబోతున్నారు. అయితే హైకోర్టులో తీర్పు వచ్చేదాకా ఆగుతారా లేకపోతే… ఎప్పట్లాగే డోంట్ కేర్ అంటారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.