టీటీడీ అధికారుల తీరు ఎప్పటికప్పుడు వివాదాస్పదమవుతూనే ఉంది. తిరుమల అంటే శ్రీనివాసుడు . ..శ్రీనివాసుడు అంటే తిరుమల. అలాంటిది ఇప్పుడు తిరుమలను అంజనాద్రిగా ప్రాశస్త్యం కల్పించేందుకు ప్రత్యేకంగా చొరవ తీసుకుని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు టీటీడీ అధికారులు. వివాదాస్పదమవుతున్నా.. స్వాముల్ని హౌస్ అరెస్ట్ చేసి మరీ శంకుస్థాపన లాంటి కార్యక్రమాలు చేయడానికి వెనుకాడటం లేదు. కర్ణాటకలోని హంపీలో ఉన్న కిష్కింధ క్షేత్రమే హనుమంతుని జన్మస్థలమని.. టీటీడీ తప్పిదానికి పాల్పడుతోందని ఆరోపిస్తున్న గోవిందానంద సరస్వతిని ఇంట్లోనే ఉంచి పోలీసులు తాళం వేశారు.
ఆయన తిరుమల వచ్చి అంజనాద్రి శంకుస్థాపనను అడ్డుకుంటారని ఈ పని చేశారు. మరో వైపు ఈ అంశంపై న్యాయస్థానాల్లోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. అంజనాద్రి కొండపై సుందరీకరణ పనులు తప్ప…. దేవాలయ ఏర్పాటు, ఇతర నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. తిరుమల శ్రీవారి వైభవాన్ని తగ్గించే విధంగా… అంజనాద్రి దేవాలయ నిర్మాణం చేపట్టబోతున్నారని పేర్కొంటూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
తిరుమల కొండల్లో మనుషుల చేతుల మీదుగా ఎలాంటి విగ్రహాన్ని ప్రతిష్టించకూడదని, పురాణాలు అదే విషయాన్ని చెబుతున్నాయని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హనుమంతుని జన్మస్థానం పేరుతో అంజనాద్రి కొండను ఏడు కొండల నుంచి వేరు చేసే యత్నం జరుగుతోందన్న విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. టీటీడీని.. శ్రీ వేంకటేశ్వరుడని ఎందుకు ఇలా వివాదాస్పదం చేస్తున్నారో అధికారులకే తెలియాలి.