తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ ప్రత్యేకమైన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం.. తెలంగాణ సాధన.. ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుపుకున్న పుట్టిన రోజులు విజయోత్సవాలను తలపిస్తే ఇప్పుడు మాత్రం ఆయన మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్న పరిస్థితుల్లో పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సారి ఆయన ఢిల్లీకి గురి పెట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి కట్టే ప్రయత్నంలో ఉన్న ఆయనకు ఎదురొచ్చిన తొలి బర్త్ డే ఇది.
రాజకీయాల్లో ప్రజల మద్దతు ఉంటేనే ఎవరికైనా విజయాలు. ఈ విషయం కేసీఆర్‌కు తెలుసు. అందుకే తెలంగాణ ప్రజలు పంపిస్తే ఢిల్లీ కోటను బద్దలు కొడతానని చెబుతున్నారు. దానికి తగ్గట్లుగా ప్రజలు తనకు మద్దతు ఇచ్చేలాగా ట్యూన్ చేసుకుంటున్నారు. ఇప్పటికి ఆ విషయంలో ముందడుగు వేశారు. ప్రజలు తనకు మద్దతుగా ఉన్నారని నిరూపించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ బర్త్ డే ను చాలా స్పెషల్‌గా నిర్వహిస్తున్నాయి. మూడు రోజుల కార్యక్రమాలను ప్లాన్ చేశాయి. పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. కొంత మంది తెలంగాణ నేతలు సూరత్‌లోనూ ఫ్లెక్సీలు పెట్టడం వైరల్ అయింది.
జాతీయ నేత ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్‌కు ఈ ఏడాది అత్యంత కీలకం. ఈ పుట్టిన రోజు ముగిసిన తర్వాతి నుండే ఆయన జాతీయ రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టబోతున్నారు. వచ్చే ఏడాది మళ్లీ పుట్టిన రోజుకు ఆయన జాతీయ రాజకీయాల్లో ఏ స్థాయిలో ఉంటారనేదే ఇప్పుడు కీలకం. గతంలో ఎన్నో సాధించిన పుట్టిన రోజులు చేసుకున్నారు కానీ.. ఈ సారి సాధించడానికి సన్నద్ధమయ్యే దశలో పుట్టినరోజు చేసుకుంటున్నారు. అందుకే టీఆర్ఎస్ నేతలు కూడా శక్తి మేర్ గ్రీట్ చేస్తున్నారు. మద్దతు తెలుపడం ద్వారా బెస్టాఫ్ లక్ చెబుతున్నారు.