ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి గత మూడేళ్ల కాలంలో మొదటి సారిగా ఇండియా బయట పెట్టుబడుల కోసం ఓ ప్రయత్నం జరిగింది. దుబాయ్ ఎక్స్‌పోలో బాగా ఖర్చు పెట్టి ఓ పెవిలియన్ కూడా ఏర్పాటు చేశారు. ఓ పెద్ద కాన్ఫరెన్స్ హాల్ దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు .. అలాగే గల్ఫ్‌లో ప్రముఖ పత్రిక అయిన ఖలీజ్ టైమ్స్‌లో పెయిడ్ పబ్లిసిటీ కూడా బాగానే చేశారు. చివరికి ప్రభుత్వం తరపున పెట్టుబడుల ఆకర్షణకు వెళ్లిన పరిశ్రమ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మూడు కంపెనీలతో ఎంవోయూ చేసుకున్నామని రూ. మూడు వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రకటించారు. ఆ కంపెనీల వివరాలు ప్రకటించారు. వాటి “ఘన” చరిత్రను ఓ సారి చూద్దాం !
కాజస్ ఈ మొబిలిటి .. వెబ్ సైట్ కూడా లేని కంపెనీ !
ఏపీ ప్రభుత్వ అధికారులు లండన్‌కు చెందిన కాజస్ ( Kajas ) ఈ మొబిలిటి కంపెనీ కడప జిల్లాలో రూ. మూడు వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఎంవోయూ చేసుకుందని ప్రకటించారు. ఈ కంపెనీ లండన్‌లో ఎక్కడ ఉందా అని ఇంటర్నెట్ మొత్తం వెదికినా ఎవరికీ కనిపించలేదు. వెబ్ సైట్ అయినా దొరుకుతుందేమోనని చూసినా కనిపించలేదు. చివరికి అధికారులు చెప్పినట్లుగా కాజస్ ( Kajas ) కాకుండా CAUSIS E-MOBILITY PRIVATE LIMITED పేరుతో ఇండియాలోనే ఓ కంపెనీ నమోదయి ఉన్నట్లుగా తేలింది. ఏపీ మంత్రి మేకపాటి చెప్పింది ఈ కంపెనీ గురించే . ఎందుకంటే తాము ఒప్పందం చేసుకున్న కంపెనీ ప్రతినిధుల్లో రవికుమార్ పంగా పేరు ఉంది. ఈ కంపెనీకి ఉన్న ఇద్దరు డైరక్టర్లలో ఆయన ఒకరు. మరొకరు సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. ఈ కంపెనీ గొప్ప ఘన చరిత్రేమీ లేదు. ఖచ్చితంగా ఈ కంపెనీ ప్రారంభించి ఇరవై నెలలు మాత్రమే అయింది. ఒక్క ఈవీ వెహికల్‌ను ఉత్పత్తి చేసిన ట్రాక్ రికార్డు లేదు. కంపెనీ పెట్టింది కేవలరం రెండు అంటే రెండు కోట్ల పెట్టుబడితో. రవికుమార్ పంగా లండన్ బేస్డ్ కంపెనీకి సీఈవో అని చెప్పుకున్నా.. ఆయన లింక్డ్ఇన్ అకౌంట్లో మాత్రం దుబాయ్‌లోనే ఉంటానని చెప్పుకున్నారు. ఏడాదిన్నర కిందట వరకూ ఆయన అశోక్ లేలాండ్ కంపెనీలో పని చేశారు. కొసమెరుపేమిటంటే ఏపీతో దుబాయ్‌లో ఒప్పందం చేసుకోవడానికే ముందే మహారాష్ట్రతో గత ఏడాది జూన్‌లోనే ఓ ఒప్పందం చేసుకున్నారు. ఆ రాష్ట్రంలో ఏకంగా రూ. 2800 కోట్ల పెట్టుబడి పెడతామన్నారు. కానీ ఇప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. మరి ఇలాంటి కంపెనీ కడపకు వచ్చి రూ. మూడు వేల కోట్ల పెడతానంటే గౌతం రెడ్డి ఎలా నమ్మారో మరి ! ఈ పెట్టుబడి పబ్లిసిటీ కోసమా.. గూడు పుఠాణి కోసమా అన్నది తర్వాత తేలాల్సి ఉంది.
గ్రాండ్ హైపర్ మార్కెట్స్ రూ. 150 కోట్ల పెట్టుబడి !
గల్ఫ్‌లో ఉండే వారికి గ్రాండ్ హైపర్ మార్కెట్స్ గురించి తెలియకుండా ఉండదు. గ్రాంట్ హైపర్ మార్కెట్స్ అని ఏపీ పరిశ్రమల అధికారులు మీడియాకు సమాచారం ఇచ్చారు కానీ అది గ్రాండ్ హైపర్ మార్కెట్స్, వీటీని రీజెన్సీ గ్రూప్ నిర్వహిస్తోంది. ఈ కంపెనీ రూ. 150 కోట్ల పెట్టుబడిని ” జీ టు బీ ” గవర్నమెంట్ టు బిజినెస్ రూపంలో పెట్టుబడి పెడుతుంది. అంటే ప్రభుత్వం కూడా వీరి వ్యాపారంలో భాగం కావాల్సి ఉంది. అది ఎలాంటిది.. ఎందుకు ఏమిటి ఎలా అనేది ముందు ముందు ఆ కంపెనీ ప్రతినిధులు ఏపీకి వచ్చి తము చేసుకున్న ఒప్పందాన్ని ఎగ్జిక్యూట్ చేసుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తేనే తెలుస్తుంది.
ట్రాయ్ ట్రేడింగ్ ఇంటర్నేషనల్ …పెట్టుబడి ఎంతో తెలీదు !
” ట్రాయ్ ” అంటే అందరికీ ఓ సూపర్ హిట్ ఇంగ్లిష్ సినిమా గుర్తుకు వస్తుంది. ఈ పేరుతో ఉన్న అంతర్జాతీయ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ సంస్ధ ఎస్సార్ గ్రూపునకు చెందినదని విశాఖలో మూడు వందల హై ఎండ్ ఐటీ జాబ్స్‌ను క్రియేట్ చేసేందుకు అంగీకరించిందని తెలిపారు. ఎంత పెట్టుబడి పెడతారు… ఎంత భూమి ఇస్తారన్నదానిపై స్పష్టత లేదు. అయితే ఈ ట్రాయ్ వెబ్ సైట్ ప్రకారం గ్యాస్, మైనింగ్, హైడ్రో పవర్, ఐరన్ అండ్ స్టీల్ వంటి రంగాల్లో ముందున్నామని చెప్పుకుంది కానీ ఐటీ రంగంలో తమ పాదముద్రలు కూడా ఉన్నాయని చెప్పుకోలేదు. మరి ఐటీ ఉద్యోగాలు… అదీ హైఎండ్ ఉద్యోగాలు ఎలా కల్పిస్తుందో మరి !
ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదుల సంఖ్యలో కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయన్నారు. రూ. కోట్ల లెక్కలు చెప్పారు. చివరికి సీఎం కుటుంబానికి పెట్టుబడులు ఉన్న భారతి సిమెంట్స్ కంపెనీ వికాట్ కూడా వేల కోట్లతో విస్తరణ చేపట్టబోతోందని చెప్పుకున్నారు. కానీ ఏ ఒక్కటి ఎగ్జిక్యూట్ కాలేదు. ఆయా కంపెనీలు కూడా చాలా వరకూ కనీసం వెబ్ సైట్లు లేనివే.