హైదరాబాద్: మైదుకూరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు రఘురామిరెడ్డి టీవీ 9 న్యూస్ ఛానల్‌పై మండిపడ్డారు. తాను వైసీపీని వీడి తెలుగుదేశంలోకి పార్టీ ఫిరాయిస్తున్నట్లు టీవీ 9 ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. టీవీ 9 అంటే గౌరవం ఉందని, కానీ వాళ్ళు కూడా అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. పార్టీ మారే అవకాశంలేని తమలాంటివారిపై ఇలాంటి ప్రచారమా అని ప్రశ్నించారు.
ఓ పార్టీ ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలను వేరే పార్టీవారు పిలవటమే తప్పని అన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలు మరో పార్టీలో చేరితే నియోజకవర్గాల్లో ఎలా తిరుగుతారని రఘురామిరెడ్డి ప్రశ్నించారు. ఇవాళ ఆయన కడపలో పర్యటిస్తున్న జగన్‌ను పొద్దుటూరులో కలిశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ జగన్ వెంటే తన పయనమని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నట్లు న్యూస్ ఛానల్స్ ఇష్టమొచ్చినట్లు వార్తలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించారు.