హైదరాబాద్: రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై నిన్న పార్లమెంట్‌లో జరిగిన చర్చలో కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను ఫోన్ చేస్తే సార్ బిజీగా ఉన్నారని సమాధానం వచ్చిందని చెప్పారు.
రోహిత్ వేముల అంశంపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై స్మృతి ఇరానీ పార్లమెంట్‌లో శివతాండవమే చేశారు. సినిమాలలో, టీవీలలో ఎన్నో ఉద్వేగభరిత సన్నివేశాలలో అత్యద్భుతంగా నటించిన అనుభవమున్న మంత్రి, నిన్న పార్లమెంట్‌లో కూడా తన ప్రసంగాన్ని రక్తి కట్టించారు. చేతులూపుతూ, కళ్ళు పెద్దవి చేస్తూ, స్వరాన్ని పెంచుతూ – తగ్గిస్తూ నాటకీయతను జోడించి, సెంటిమెంట్‌ను రంగరించి నిలువెల్లా ఊగిపోతూ ప్రసంగించారు.
రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించిన పరిణామాలను వివరిస్తూ, చనిపోయిన వార్త తెలియగానే శాంతి భద్రతల విషయంలో సహకరించాలని కోరేందుకు తాను కేసీఆర్‌కు ఫోన్ చేశానని చెప్పారు. సార్ బిజీగా ఉన్నారని, ఇప్పుడు మాట్లాడలేరని సమాధానమొచ్చినట్లు తెలిపారు. వెంటనే ఆయన కుమార్తె కవితకు ఫోన్ చేసినట్లు వెల్లడించారు. ఆయన మళ్ళీ ఫోన్ చేస్తారనే ఉద్దేశ్యంతో వేచి చూశానని, ఇప్పటికీ ఆయననుంచి ఫోన్ రాలేదని చెప్పారు. అయినా కూడా ఇప్పటివరకు ఆ విషయం బయటకు చెప్పలేదని అన్నారు.
టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి జోక్యం చేసుకుని, కేసీఆర్‌కు స్మృతి ఇరానీ ఫోన్ చేసినప్పుడు తాను అక్కడే(కేసీఆర్ ఇంటివద్దే) ఉన్నానని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి వెంటనే ఇంటలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డితో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారని తెలిపారు. 15 నిమిషాల తర్వాత శివధర్ రెడ్డి తిరిగి ఫోన్ చేసి అక్కడ చాలామంది గుమిగూడి ఉన్నట్లు చెప్పారని వెల్లడించారు. పరిస్థితి అదుపులోకి రావాలంటే కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను అరెస్ట్ చేయాల్సి ఉంటుందని ఐజీ చెప్పినట్లు జితేందర్ రెడ్డి చెప్పారు. ఇదే విషయాన్ని ప్రధానికి కేసీఆర్ వివరించినట్లు తెలిపారు. ఈ విషయంలో తాము పూర్తిగా సహకరించామని, తమపై ఆరోపణలు చేయలేరని జితేందర్ అన్నారు. కేసీఆర్ తగిన విధంగా స్పందించారని, పైగా అప్పట్లో తాము జీహెచ్ఎంసీ ఎన్నికల హడావుడిలో ఉన్నామని చెప్పారు.
దీనిపై స్మృతి స్పందిస్తూ, “ఈ ప్రకటన చాలా విచిత్రంగా ఉంది. కేంద్ర మంత్రి దత్తాత్రేయను అరెస్ట్ చేయాలట, అది కూడా తప్పుచేసినందుకు కాదు, అక్కడున్నవారిని కంట్రోల్ చేసేందుకట” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.