ఓ బలమైన వ్యక్తిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి ? బలహీనులంతా ఏకమవ్వాలి. ఎంత పెద్ద పాము అయినా చలి చీమల చేత చిక్కి చస్తుందని గుర్తు తెచ్చుకోవాలి. చిన్న గడ్డి పోచ కూడా అన్నీ కలిపి పేనితే తెంచలేనివిధంగా మారుతుందని లెక్కలేసుకోవాలి. కానీ నేను బలమైన వ్యక్తితో ఒంటరిగానే పోరాడతారు. లేకపోతే కొంత మందితోనే పోరాడుతాను అంటే సత్ఫలితాలు రావు. అది నిజం. రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిన్నవారికి ఇది తెలియదని కాదు. కానీ వారు అదే తప్పు చేస్తున్నారు. మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. ఇదే మోడీకి బలంగా మారింది. ఆయన అధికారానికి తిరుగులు లేకుండా చేస్తోంది.
కాంగ్రెస్‌దో దారి – ప్రాంతీయ పార్టీలది మరో దారి !
విపక్షాలు కూడా విడివిడిగా తమ రాష్టాల్ల్రో అధికారం పొందడం ఎలా అన్న ఆలోచనలో మాత్రమే ఉన్నాయి. విపక్షాల్లో ఉమ్మడిగా, కలసికట్టుగా పోరాడుదామన్న భావన లేకపోవడం కూడా మోడీకి కలిసి వస్తోంది. అందుకే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నా, విపరీతంగా పెట్రో ధరలు పెంచుతున్నా, నిరుద్యోగ సమస్య పెరుగుతున్నా నిలదీసే వారు లేరు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పెద్దగా ప్రశ్నించేవారు కనపడడం లేదు. నరేంద్రమోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్రతరం అయిందని వపిక్షనేతలంతా భావిస్తున్నారు. ఇదే అదనుగా ప్రజలు ప్రత్యామ్నాయంగా తమ వైపు చూస్తారన్న ఆశాభావంలో అన్ని పార్టీల నేతలు ఉన్నారు. కాంగ్రెస్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. నిజానికి మోదీ అనేక ప్రజా వ్యతిరేక, నిరంకుశ నిర్ణయాలు తీసుకు న్నారనడంలో సందేహం లేదు. వివిధ వర్గాల ప్రజలు తీవ్ర నిరసనను కూడా వ్యక్తపరిచారు. నెలల తరబడి ఆందోళనలను నిర్వహించారు. మేధావులు, ప్రజాస్వామికవాదులలో కూడా మోదీ పట్ల తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది. పెట్రోల్, డీజిల్‌తో సహా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటాయి. నిరుద్యోగం పెచ్చరిల్లిపోయింది. మోదీ ప్రభుత్వ విధానాల పట్ల ప్రతిపక్షాల్లో మాత్రమే కాదు స్వపక్షాల్లో కూడా చర్చ జరుగుతోంది. అయినప్పటికీ ఈ ప్రజావ్యతిరేకతను పూర్తిగా తమ వైపుకు మళ్లించగల శక్తి, నాయకత్వం దేశంలో ప్రస్తుతమున్న పార్టీలకు, నేతలకు లేదని నిరూపితం అయ్యింది.
ఇప్పడిప్పుడే ధైర్యం చేస్తున్న ప్రాంతీయ పార్టీలు !
నిన్నామొన్నటి వరకూ పశ్చిమ బెంగాల్లో ఒక్క మమతా బెనర్జీ తప్ప దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీలు కూడా బిజెపిని నేరుగా ఢీకొనేందుకు ధైర్యాన్ని ప్రదర్శించలేక పోయాయి. ఇప్పుడు కేసీఆర్ తెర ముందుకు వచ్చారు. డీఎంకే కాంగ్రెస్‌తో కలిసి బీజేపీని వ్యతిరేకిస్తోంది. శివసేన బీజేపీని వ్యతిరేకిస్తున్నా.. ఆ పార్టీని నమ్మడానికి లేదు. ఎందుకటే బీజేపీకి ఆ పార్టీకి పెద్దగా తేడాల్లేవు. బిజెపి గ్రాఫ్ పడిపోతుందని, ఓటమి దిశన పయనిస్తుందని సంకేతాలు వస్తే కాని అనేక ప్రతిపక్షాలు నేరుగా బిజెపిని ఢీకొనేందుకు సిద్దపడకపోవచ్చు. చంద్రబాబు లాంటి వారు మోడీని ఢీకొనాలని దారుణంగా దెబ్బతిన్నారు. ఆ అనుభవంతో ఇతర ప్రాంతీయ పార్టీలు వీలైనంత మోడీ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నాయి. నవీన్ పట్నాయక్ ఎప్పుడూ బయటకు రారు. ఇక ప్రాంతీయ పార్టీలు కలిస్తే మమతా బెనర్జీ, కేసీఆర్, స్టాలిన్ తప్ప ఎవరూ లేరు. మిగతా వారంతా గోడ మీద పిల్లులే.
కాంగ్రెస్ లేకుండా కూటమి ఎలా సాధ్యం ?
కాంగ్రెస్ లేకుండా మిగతా పార్టీలన్నీ ఓ కూటమిగా ఏర్పడతామని చెబుతున్నాయి. అందు కోసం కేసీఆర్, మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. కానీ బీజేపీని ఓడించాలంటే.. కచ్చితంగా కాంగ్రెస్ సపోర్ట్ కావాల్సిందే. ఇప్పటికే దేశంలో దాదాపుగా 250 పార్లమెంట్ సీట్లలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు నడుస్తోంది. మిగతా చోట్ల.. కొన్ని చోట్ల కాంగ్రెస్, మరికొన్ని చోట్ల బీజేపీతో .. మరికొన్నిచోట్ల రెండూ ప్రాంతీయ పార్టీలో ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ కారణంగా… బీజేపీని కాదని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి రావాలంటే కచ్చితంగా కాంగ్రెస్ ఉండాల్సిందే. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే కొన్ని రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు చాలా లాభం కలుగుతుంది. అయితే తాత్కాలిక ప్రాతిపదిన పొత్తులు పెట్టుకుని రాజకీయల లబ్దిపొందుదామంటే.. ఫలితాలు రావు. ప్రాంతీయ పార్టీలు ఏకమైనా బీజేపీ ఇబ్బందే. కానీ అది.. సామాజిక, ఆర్థిక , రాజకీయ సిద్దాంతాలు బలంగా లేకుండా.. చంచలంగా వ్యవహరిస్తే.. అది అంతిమంగా బీజేపీ బలపడటానికి కారణం అవుతుంది. ప్రస్తుతం జరుగుతోంది అదే.
మోడీపై ఆధారపడితే బీజేపీకి గడ్డు కాలమే !
భారతీయ జనతా పార్టీకి కూడా ప్రస్తుత పరిస్థితులు క్లిష్టమే. మోడీ చేతుల్లో ఉన్నంత వరకే బిజెపి బలంగా కనిపిస్తుంది. మోదీ లాంటి నాయకుడు లేడని జబ్బలు చరచుకోవడం గతంలో ఉన్న బిజెపిలో ఎప్పుడూ కానరాదు. వాజ్‌పేయి,అద్వానీల సమయంలో కూడి ఇంతగా పొగడ్తలు, వ్యక్తి ఆరాధనలు బిజెపిలో లేవు. మోడీ, అమిత్‌షా ద్వయం తమ బలాన్ని, అధికారాన్ని మరింతగా పెంచుకుని దేశంలో విపక్షం అన్నది లేకుండా చేసేక్రమంలో క్రమంగా విజయం సాధించడం వెనక బలపమైన ప్రతిపక్షం లేకపోవడమే కారణం. పార్టీలో మరో బలమైన నేతల ఉంటే ఈ పరిస్థితి బిజెపి పార్టీకి ఉండేది కాదు. బలమైన నేతలు ఉన్నా… రాజ్ నాథ్. గడ్కరీ లాంటి వారిని వ్యూహాత్మకంగా బలహీనుల్ని చేసేశారు.
కులాలు, మతాలుగా చీల్చేసి రాజకీయ లాభం పొందుతున్న బీజేపీ !
2009కి పూర్వం కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వం పట్ల ఏర్పడిన తీవ్ర ప్రజావ్యతిరేకతను, కుంభకోణాలను బిజెపి పూర్తిగా తన వైపుకు తిప్పుకోగలిగింది. బిజెపికి హిందూత్వ సైద్దాంతిక ప్రాతిపదిక, సంస్థాగత పటిష్ఠత, ఆర్ఎస్ఎస్ తోడ్పాటు కారణంగా మోదీ నిర్ణయాలు కొన్ని కలసి వచ్చాయి. అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి హిందుత్వ వాదులు సిద్దంగా లేరు. ఇదే మోడీకి కూడా బాగా కలసి వస్తోంది. మోడీకి వ్యక్తిగత ప్రాబల్యం, ఓట్లను కులాలవారీగా, వర్గాలవారీగా చీల్చగలిగిన వ్యూహరచన కలసి వస్తోంది. వివిధ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ప్రయోగించి భయభ్రాంతుల కు గురి చేస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆందోళన వెనుక ఈ దర్యాప్తు సంస్థలే ఉన్నాయన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయితే అంతమాత్రాన బిజెపి తనకు తిరుగులేదని అనుకోవడానికి లేదు. ప్రజావ్యతిరేకత ఎక్కడ ఏ రూపంలో అయినా రావచ్చు.. వ్యతిరేకతల నుంచే నాయకుడు రావచ్చు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాకుండా మరో ఏడాదిలో బీజేపీ 11 రాష్టాల అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉన్నది. ఆ తర్వాత 2024లో సార్వత్రక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది రాజకీయంగా కీలకమైన రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో యథాప్రకారం భారీ మెజారిటీతో యోగి మరోమారు విజయం సాధించకపోతే బిజెపికి ఎదురుదెబ్బలు తప్పవు.
రాజకీయ పార్టీల చంచలత్వమే అసలైన శాపం
అయితే దాన్ని క్యాష్ చేసుకునేంత రాజకీయం ప్రస్తుత … పార్టీల వద్ద ఉందా అనేదే అసలు విషయం. ప్రాంతీయ పార్టీలు ఏ పార్టీతో అయినా జట్టు కట్టడానికి సిద్ధమన్నట్లుగా ఉంటున్నాయి. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బిజూ జనతాదళ్, ఎస్పీ సహా అనేక పార్టీలది అదే దారి. ఈ పరిస్థితి బీజేపీకి తిరుగులేని స్థానాన్ని ఇస్తున్నాయి.