విభజన సమస్యల పరిష్కారానికి తొలి సారి కేంద్ర హోంశాఖ ఆధ్వరంలో రెండు రాష్ట్రాల ప్రతినిధులతో జరిగిన చర్చల్లో తెలంగాణ పైచేయి సాధించింది. కానీ ఏపీ మాత్రం అణాపైసా ప్రయోజనం పొందలేకపోయింది. మొత్తం ఐదు అంశాలు చర్చకు రాగా.., అందులో ఒకటి ఉమ్మడి అంశం కాదని తొలగిస్తామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి తేల్చేశారు. మిగతా నాలిగింటిలో ఏపీ తెలంగాణకు చెల్లించాల్సిన అంశం తప్ప మిగిలిన వాటిలో సానుకూలత రాలేదు. తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పోరేషన్ లిమిటెడ్‌కు రూ.354 కోట్ల బకాయిలు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీ తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పోరేషన్ బదిలీ అయ్యేలా అండర్‌టేకింగ్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది.
అదే సమయంలో ఏపీకి రావాల్సిన నిధుల విషయంలో తెలంగాణ కోర్టు కేసుల్ని కారమంగా చూపించింది. విద్యుత్ బకాయిలు ఏపీ నుంచే రావాలని తెలంగాణ చెబుతోంది. బకాయిలు చెల్లించకుండా ఎపి ప్రభుత్వం హైకోర్టులో కేసు దాఖలు చేసిందని తెలంగాణ ఆరోపించిది. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్విభజన ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా కేంద్రానికి పంపిందని తెలంగాణ పేర్కొంది. ఎపిఎస్ఎఫ్సికి 253 ఎకరాల భూ కేటాయింపులపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ హైకోర్టును ఆశ్రయించి ఎపి ప్రభుత్వం స్టేటస్ కో పొందిందని, నానక్‌రామ్ గూడలోని కార్పోరేషన్ ఆస్తుల పంపకాల్లో కూడా వివాదం నడుస్తోందని తెలంగాణ వాదించింది. ఇంకా ఇతర అంశాల్లో ఏపీ నుంచే నిధులు రావాలని వాదించింది. వీటన్నింటిపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దాంతో సమస్య పరిష్కారం కాలేదు.
మరో వైపు అసలు చర్చలు కాకుండా చట్టాన్ని మార్చాలని ఏపీ అధికారులు పట్టుబట్టడం వివాదాస్పదంగా మారింది. చట్టంలో అనేక లోపాలున్నాయని, ఫలితంగా పన్నులతో పాటు అనేక అంశాల్లో రాష్ట్రం నష్టపోతోందని వాదించారు. అయితే సమస్య చట్టం కాదని చెప్పి కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆ అంశంపై చర్చ ముగించారు. మొత్తంగా ఈ చర్చల వల్ల ఏపీ తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పోరేషన్ లిమిటెడ్‌కు నిధులు చెల్లిస్తుంది. కానీ ఏ విషయంలోనూ ఏపీకి తెలంగాణ నుంచి నిధులు రావు. మరో సమావేశంలో ప్రయత్నించాల్సిందే.