ఇప్పడొక అగ్ర నటుడి సినిమా విడుదలవుతోందంటే దాని గురించి సోషల్ మీడియాలో ఆత్రుతగా, ఆసక్తికరంగా చర్చించుకోవడం కామన్. మోహన్‌బాబు నటించిన `సన్ ఆఫ్ ఇండియా` కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీని గురించి మాట్లాడుకున్న విధానం వేరు. బుకింగ్స్‌పై ఓ రేంజ్లో ట్రోల్ జరిగింది. గమ్మత్తైన మీమ్స్ సృష్టించారు. ఈమధ్య కాలంలో ఆ రకంగా ట్రెండ్ అవుతూ విడుదలైన సినిమా ఇదే. దీని వెనక ఇద్దరు హీరోలు ఉన్నారంటూ మోహన్‌బాబు కూడా మీడియా ముందు వాపోయారు. ఎలాగైతేనేం ట్రెండింగ్ మధ్యే ఈ సినిమా విడుదలైంది. మరి ఎలా ఉందో తెలుసుకుందాం..
చాలా సినిమాల్లోని కథే ఇందులోనూ ఉంది. మొన్ననే విడుదలై విజయవంతమైన `నాంది`లో స్పృశించిన అంశమే ఇందులోనూ ఉంది. కాకపోతే ఆ విషయాన్ని ఇందులో ఓ రివేంజ్ కథతో ముడిపెట్టారు. అసలు సంగతికొస్తే బాబ్జీ (మోహన్‌బాబు) ఓ డ్రైవర్. ఎన్.ఐ.ఎ అధికారిణి అయిన ఐరా (ప్రగ్యా జైశ్వాల్) దగ్గర పనిచేస్తుంటాడు. కేంద్రమంత్రి మహేంద్రభూపతి (శ్రీకాంత్) కిడ్నాప్‌కి గురవుతాడు. అతనితోపాటు ప్రతిభ అనే డాక్టర్, భగవాన్ ప్రసాద్ (రాజా రవీంద్ర) అనే దేవాదాయ శాఖకి చెందిన ఛైర్మన్ కూడా కిడ్నాప్ అవుతారు. ఈ కేసుని ఛేదించడం కోసం ఐరా రంగంలోకి దిగుతుంది. దీని వెనక బాబ్జీ ఉన్నాడని తెలుస్తుంది. ఇంతకీ బాబ్జీ ఆ కిడ్నాప్‌లు ఎందుకు చేశాడు? బాబ్జీ డ్రైవర్ కాదు, అతని పేరు విరూపాక్ష అనే విషయం ఎలా ఎప్పుడు తెలిసింది? విరూపాక్ష ఎవరు? తదితర విషయాల్ని మిగతా కథ చెబుతుంది.
ఇదొక ప్రయోగం అని చెబుతూ వచ్చింది చిత్రబృందం. నిజంగానే ఇదొక ప్రయోగమే. అయితే ఎప్పుడైనా ప్రయోగం చేసేది కథకి అవసరమైనప్పుడు, సన్నివేశాలు డిమాండ్ చేసినప్పుడే. కానీ ఈ సినిమాకి అలా కాదు. బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకుని ప్రయోగం చేశారు. నటుల్ని కేవలం ఒకట్రెండు సన్నివేశాల్లోనే చూపించేసి, మిగతా సన్నివేశాల్లో వాళ్ల వాయిస్‌లు మాత్రమే వినిపిస్తూ డూప్లతో లాగించేశారు. దీనివల్ల ఆయా నటుల కాల్షీట్లని పొదుపు చేసి బడ్జెట్‌ని మిగిలించొచ్చేమో కానీ సినిమాలో ఆ ఫీల్ మాత్రం పండదు కదా. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. నటులు కూడా తాము చేయని సన్నివేశాలకి డబ్బింగ్ చెప్పే సాహసం చేస్తారా అంటే ఇక్కడ మోహన్‌బాబు కాబట్టే ఈ ప్రయోగం సాధ్యమైందేమో అనిపిస్తుంది.
ఇందులో కథ ఉంది, కథనం ఉంది, సన్నివేశాలు ముందుకు సాగిపోతుంటాయి కానీ సినిమా చూస్తున్న అనుభూతి మాత్రం ఎక్కడా కలగదు. చాలా సినిమాల్లో చూసిన ఓ రివేంజ్ స్టోరీ చుట్టూ సన్నివేశాలు అల్లారు. బాబ్జీగా పరిచయమై, ఆ తర్వాత కిడ్నాప్‌లు చేసేసి, తనకి తానే తన గతం ఇదీ అంటూ విరూపాక్ష కథని చెబుతాడు కథానాయకుడు. బాబ్జీ పాత్ర పరిచయం, అతను ముగ్గుర్ని కిడ్నాప్ చేయడం వరకు పర్వాలేదనిపించినా ఆ తర్వాత సన్నివేశాలు మామూలే. ఎన్.ఐ.ఎ కూడా బాబ్జీనే కిడ్నాపర్ అని అతను చెబితే తప్ప తెలుసుకోలేకపోతుంది.
తన గతాన్ని కూడా కథానాయకుడే బయట పెట్టడం పెద్దగా ఆకట్టుకోదు. విరూపాక్ష కుటుంబం నేపథ్యంలో సన్నివేశాల్లోనూ సెంటిమెంట్ పండలేదు. అలీ, సునీల్, వెన్నెల కిషోర్, బండ్ల గణేష్, పృథ్వీ తదిరత నటులున్నా వాళ్ల పాత్రలు నవ్వించలేకపోయాయి. ఓటీటీ లక్ష్యంగా తీసిన సినిమా అని చిత్రబృందం చెప్పినా, ఆ వేదికలకి తగ్గ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఇందులో ఏమీ లేవు. అమ్మాయిల్ని రకరకాల యాంగిల్లో చూపెట్టి డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పించారంతే. వాటినే ఓటీటీ మెజర్మెంట్స్ అనుకోవాలేమో. 40 వేల మందికి పైగా నిరపరాధులు అన్యాయయంగా జైళ్లలో మగ్గుతున్న విషయాన్ని విరూపాక్ష కథకి జోడించి చెప్పారంతే. గంటన్నరకిపైగా నిడివి ఉన్న ఈ సినిమాలో మోహన్‌బాబు తప్ప ఇతర ఏ పాత్ర కూడా పరిపూర్ణంగా అనిపించదు. చిరంజీవి వాయిస్‌తో కథానాయకుడి పాత్ర పరిచయమవుతుంది. కానీ ఆ డైలాగ్‌ల్లో ఉన్న బలం పాత్రలో ఎక్కడా కనిపించదు. రఘువీర గద్యం నేపథ్యంలో పాట బాగున్నా, విజువల్ ఎఫెక్ట్స్ మరీ నాసిరకంగా ఉన్నాయి. మోహన్‌బాబు డైలాగ్ కింగ్ కాబట్టి ఆయన మార్క్ డైలాగులు ఇందులో ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు.
ఏకపాత్రాభినయం చేశానని సినిమా ఆరంభానికి ముందే చెప్పిన మోహన్‌బాబు, అందుకు తగ్గట్టే తెరపై కనిపించారు. నిజానికి తెరపై బోలెడన్ని పాత్రలు కనిపించినా `ప్రయోగం`లో భాగంగా మోహన్‌బాబు మాత్రమే హైలెట్ అయ్యారు. మిగతా పాత్రలేవీ ప్రభావం చూపించలేకపోయాయి. శ్రీకాంత్, పోసాని తదితర ప్రముఖ నటులున్నా వాళ్ల పాత్రలు ఒకట్రెండు సన్నివేశాలకే పరిమితం. ప్రగ్యా, పృథ్వీ, సునీల్, బండ్ల గణేష్, వెన్నెల కిషోర్ అతిథి పాత్రల్లాగా కనిపిస్తారంతే. టెక్నికల్‌గా సినిమా పెద్దగా ప్రభావం చూపించదు. ఇళయరాజా రఘువీర గద్యంతోపాటు, బుర్రకథ నేపథ్యంలో ఓ పాట చేశారు. నేపథ్య సంగీతం పర్వాలేదనిపిస్తుంది. సర్వేష్ మురారి కెమెరా పెద్దగా ప్రభావం చూపించదు. నిర్మాణం నాసిరకంగా ఉంది. దర్శకుడు డైమండ్ రత్నబాబు కథానాయకుడి పాత్రని డిజైన్ చేయడం వరకు పర్వాలేదనిపించారు తప్ప, కథ కథనాలపై ఆయన పెద్దగా ప్రభావం చూపించలేదు.
మోహన్‌బాబు చెప్పే సంభాషణలు, కొన్ని సన్నివేశాల్లో ఆయన మార్క్ నటన తప్ప సినిమాలో ఆకట్టుకునే అంశాలేవీ లేవు. బలమైన కథ, కథనాలు, పకడ్బందీగా సాగే సన్నివేశాలుంటే ప్రయోగాలేవీ అవసరం లేదని నిరూపించే మరో చిత్రమిది.